అయ్యప్ప భక్తులు విమానంలో ఇరుముడి తీసుకెళ్లొచ్చు

అయ్యప్ప భక్తులు విమానంలో ఇరుముడి తీసుకెళ్లొచ్చు
అయ్యప్ప దీక్ష సమయంలో స్వామివారి దర్శనం కోసం విమానంలో ప్రయాణించే భక్తులు ఇక మీదట ఇరుముడిని చెకిన్‌ బ్యాగేజీలో కాకుండా తమ వెంట తీసుకెళ్లవచ్చని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు భద్రతా కారణాల రీత్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనిచ్చేవారు కాదని చెప్పారు. అయితే భక్తుల ఇబ్బందులు తెలుసుకొని వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.  మరోవైపు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.252 కోట్లతో త్వరలో ఆరు వరుసల రహదారి పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఇప్పటికే మూలపేట పోర్టు నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. దానికి దగ్గరలోనే విమానశ్రయం నిర్మించేందుకు స్థల పరిశీలన జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉండడంతో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారని రామ్మోహన్ నాయుడు వివరించారు.

తద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో రైతుల ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. త్వరలో జిల్లాలో ఉన్న నదుల అనుసంధానం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు మేలు చేకూరుస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

“రణస్థలం వద్ద 6 లేన్ల హైవేకు కేంద్రం రూ.252 కోట్లు ఇచ్చింది. రణస్థలం వద్ద హైవేను త్వరగా పూర్తి చేస్తాం. మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయానికి స్థలం పరిశీలిస్తున్నాం” అని కేంద్ర మంత్రి తెలిపారు.

జిల్లాలో పరిశ్రమలు పెట్టేందుకు కేంద్రం, రాష్ట్రం సిద్ధంగా ఉన్నాయని చెబుతూ పరిశ్రమలు వస్తే శ్రీకాకుళం జిల్లా యువతకు ఇక్కడే ఉపాధి. నాగావళి, వంశధార, బాహుదా నదుల అనుసంధానంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని ఆయన చెప్పారు. కాగా, విశాఖ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు విమానాన్ని ప్రారంభించారు. ఈ విమానం విశాఖ-విజయవాడ మధ్య సేవలు అందించనుంది.