సెబీ చీఫ్ మాధాబీ పురీ బుచ్‌కు కేంద్రం క్లీన్ చిట్

సెబీ చీఫ్ మాధాబీ పురీ బుచ్‌కు కేంద్రం క్లీన్ చిట్
స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్‌కు కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. సెబీ చీఫ్‪గా కొనసాగుతూ పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) నిర్వహించిన దర్యాప్తు ముగిసింది. ఈ దర్యాప్తులో మాధాబీ పురీ బుచ్ గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ తప్పు చేసినటలు ఆధారాలు దొరకలేదని అధికార వర్గాల కథనం.
 
అటువంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, సెబీ చైర్ పర్సన్ గా మాధాబీ పురీ బుచ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్రం అభిప్రాయ పడ్డట్లు వినికిడి. వచ్చే ఏడాది పిబ్రవరి వరకూ ఆమె తన పదవీ కాలంలో కొనసాగుతారని అధికార వర్గాల కథనం.  అదానీ గ్రూప్ అనుబంధ విదేశీ సంస్థల్లో మాధాబీ పురీ బుచ్ పెట్టుబడులు పెట్టారని యూఎస్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల ఆరోపించింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సైతం మాధాబీ పురీ బుచ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని ఆరోపించింది. 

ఆమె భర్త ధావల్ బుచ్ తో సంబంధం ఉన్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ బ్లాక్ స్టోన్ కు లబ్ధి చేకూర్చేందుకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్టులకు మాధాబీ పురీ బుచ్ ప్రోత్సాహం ఇచ్చారని కాంగ్రెస్ మరో ఆరోపణ చేసింది. తన సొంత కన్సల్టెన్సీ సంస్థ అగోరా అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. 

ఐసీఐసీఐ నుంచి ఆదాయం పొందే మార్గాలను వెల్లడించడంలోనూఆమె విఫలం అయ్యారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై తన భర్త ధావల్ బుచ్ తో కలిసి ఉమ్మడి ప్రకటన చేశారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలనీ, దురుద్దేశంతో తమ ప్రతిష్టను దెబ్బ తీయడానికి చేసిన ఆరోపణలు అని పేర్కొన్నారు. 

తనకు 99 శాతం వాటా గల అగోరా అడ్వైజరీ, అగోరా పార్టనర్స్ ఫైల్స్ విషయంలోనూ తానూ జోక్యం చేసుకోలేదన్నారు. 2017లో సెబీ పూర్తికాల సభ్యురాలిగా చేరినప్పుడే ఈ కంపెనీల సమాచారం వెల్లడించానని చెప్పారు.