కశ్మీర్ ఉగ్రదాడికి చైనాతో లింక్! 

కశ్మీర్ ఉగ్రదాడికి చైనాతో లింక్! 
జమ్మూ కశ్మీర్‌లోని గండేర్బల్ జిల్లా సోన్‌మార్గ్‌ సొరంగ నిర్మాణ ప్రదేశం వద్ద ఆదివారం రాత్రి ఉగ్రవాదులు స్థానికేతర కూలీలు, వైద్యుడితో పాటు ఏడుగురిని బలిగొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భద్రతా బలగాలు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. ఈ దాడికి బాధ్యత వహిస్తూ పాకిస్థాన్‌ లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ ప్రకటన చేసింది. 
 
అయితే, వారి ప్రకటనతో దాడి వెనుక చైనా ప్రయోజనాలతో సంబంధం ఉందన్న కోణం వెలుగులోకి వచ్చింది.  జెడ్-మోర్ సొరంగ నిర్మాణ ప్రదేశంలో దాడిచేసిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్ ఈ దాడిని వ్యూహాత్మక దాడిగా పేర్కొంది. 
 
అంతేకాదు, ‘తూర్పు సరిహద్దుల్లో భారత సైన్యం మోహరింపునకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా ఈ దాడి జరిగింది.. ఇది మా సైనిక ప్రయోజనాలు.. మా మిత్రదేశం చైనా ప్రయోజనాలకు విరుద్ధం’ అని ప్రకటించింది. చైనా, పాకిస్థాన్‌ల మధ్య వ్యూహాత్మక సహకారం ఉన్నప్పటికీ పీఏఎఫ్ఎఫ్ ప్రకటన చేసినట్టు దాడికి బీజింగ్ మద్దతు ఇచ్చిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.
 
‘చైనా స్నేహితులు’ అనే సూచన వారి ప్రయోజనాలతో తమ లక్ష్యాలను సర్దుబాటు చేయడానికి పీఏఎఫ్ఎఫ్ చేసిన వ్యూహాత్మక ప్రయత్నమని పేర్కొన్నారు.  శ్రీనగర్ జాతీయ రహదారిపై కశ్మీర్ నుంచి లడఖ్‌ను కలిపే 6.5 కిలోమీటర్ల పొడవైన సోన్‌మార్గ్ సొరంగం అత్యంత కీలకమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అనుసంధానం జరిగేలా దీనిని డిజైన్ రూపొందించారు. 
 
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఏపీసీఓ ఇన్‌ఫ్రాటెక్ నిర్మాణ పనులు చేపట్టింది. వచ్చే నెలలోనే దీనిని ప్రారంభించనున్నారు. ‘ఆక్రమిత భూభాగంలో సైనిక ప్రాజెక్టులు మరణానికి ఉచ్చులు.. కాబట్టి, తెలివైన ప్రతి ఒక్కలూ వాటికి దూరంగా ఉండాలి.. అక్రమ ప్రాజెక్ట్‌ల నిర్మాణ పనులకు స్థానికులతో పాటు స్థానికేతర కార్మికులు దూరంగా ఉండాలి.. ఇటువంటి నిర్మాణ ప్రదేశాల్లో దాడులు తప్పవు’ అని ఉగ్రవాదులు హెచ్చరించారు. 
 
అయితే, దీనికి అధికారులు కౌంటర్ ఇస్తూ సున్నితమైన ప్రాంతంలో ఈ సొరంగం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. కాబట్టి సొరంగాన్ని కేవలం సైనిక ప్రాజెక్ట్‌గా పేర్కొనడం తప్పుదారి పట్టించడమేనని చెప్పారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం టీఆర్‌ఎఫ్ చీఫ్ షేక్ సాజిద్ గుల్ ఆదేశాలతోనే ఉగ్రదాడి జరిగింది. 
 
ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న సాజిద్ గుల్‌‌పై రూ.10 లక్షల రివార్డు ఉంది. ఆదివారం రాత్రి 8.15 గంటల సమయంలో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులు నిర్మాణ ప్రదేశంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. మెస్‌లో కార్మికులు భోజనాలు చేస్తున్న సమయంలోనే ఈ దాడి చోటుచేసుకుంది.
ఈ దాడిలో బిహార్‌కు చెందిన ఫహీమ్ నజీర్, మహ్మద్ హనీఫ్, అబ్దుల్ కలీమ్. మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ శుక్లా, పంజాబ్‌కు చెందిన గుర్మీత్ సింగ్, జమ్మూ ఆర్కికెట్ ఇంజినీర్ శశిభూషణ్, బుద్గామ్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ షానవాజ్ అహ్మద్ దర్‌లు ప్రాణాలు కోల్పోయారు.