ఆమరణ నిరాహార దీక్ష విరమించిన జూనియర్ వైద్యులు

ఆమరణ నిరాహార దీక్ష విరమించిన జూనియర్ వైద్యులు
కొలకత్తా ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనపై ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు గత 16 రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం సాయంత్రం భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మంగళవారం రాష్ట్రంలోని ఆన్ని ఆస్పత్రుల్లో తలపెట్టిన సమ్మెను కూడా విరమించుకంటున్నామని ప్రకటించారు.

“ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యాం. కొన్ని అంశాలపై హామీ వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదు. సామాన్య ప్రజలు మాకు హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చారు. ఆమరణ నిరాహార దీక్ష వల్ల క్షీణిస్తున్న మా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, మా సోదరి (హత్యాచారానికి గురైన ఆర్జీ కర్ వైద్యురాలు) తల్లిదండ్రులు దీక్ష విరమించాలని కోరుతున్నారు. అందుకే మేము మా ఆమరణ నిరాహార దీక్షను ఉపసంహరించుకుంటున్నాము.” అని జూనియర్ వైద్యులలో ఒకరైన దేబాశిష్ హాల్డర్ చెప్పారు.

అంతకుముందు రాష్ట్ర సచివాలయం నబన్నాలో సుమారు 2 గంటలపాటు సాగిన ఈ భేటీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న థ్రెట్‌ కల్చర్‌పై ఇరువర్గాలు చర్చలు జరిపాయి. జూనియర్ డాక్టర్లు చేసిన పలు డిమాండ్‌లను నెరవేర్చామని, కనుక నిరాహార దీక్ష విరమించాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. వైద్యులు తమ ముందుంచిన చాలా వరకు డిమాండ్లపై చర్యలు తీసుకున్నామని ఆమె చెప్పారు. కానీ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శిని విధుల నుంచి తొలగించాలన్న డాక్టర్ల డిమాండ్‌ను మమతా బెనర్జీ మరోసారి  తోసిపుచ్చారు.

ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను పరిష్కరించడానికి ఓ  రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మమతా బెనర్జీ వెల్లడించారు. అందులో నలుగురు జూనియర్ డాక్టర్లు, ఒక మహిళ అయిన వైద్య విద్యార్థిని, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఉంటారు.

సోమవారం ముందుగా నబన్నలో జూనియర్ డాక్టర్లు. కలకత్తాలోని ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, మెడికల్ సూపరింటెండెంట్లు 17 మంది జూనియర్ డాక్టర్లు, ప్రిన్సిపాల్స్, మెడికల్ సూపరింటెండెంట్‌లు హాజరైన రెండు గంటల సమావేశంలో టాస్క్‌ఫోర్స్ కూర్పుపై పలు అంశాలపై చర్చించారు. మార్చి 2025 నాటికి మెడికల్ కాలేజీలలో విద్యార్థి సంఘాల ఎన్నికలను నిర్వహిస్తామని మమత తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో సురక్షితమైన వాతావరణాన్ని తిరిగి తీసుకురావడానికి అందరూ కలిసి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. “దయచేసి నిరాహారదీక్షను విరమించుకుని తిరిగి ప్రజల సేవలో పాల్గొనండి. నీకు భవిష్యత్తు ఉంది. మీకు పరీక్షలు ఉన్నాయి. సిస్టమ్ కారణంగా మీ సమయం పొడిగించబడితే, మీరు బాధపడతారు. మీరు ఎందుకు బాధపడాలి?” అంటూ ఆమె వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

అంతకు ముందు ధర్నా మంచ్‌లో ఉన్న జూనియర్‌ వైద్యులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, హోంశాఖ కార్యదర్శి నందిని చక్రవర్తి పరామర్శించి, నిరసన తెలుపుతున్న వైద్యులతో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడిన తర్వాత సమావేశానికి ఆహ్వానించారు.

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన టాస్క్‌ఫోర్స్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ నేతృత్వం వహిస్తారు. దీని ఇతర సభ్యులలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రాష్ట్ర ఆరోగ్య ఫిర్యాదుల పరిష్కార విభాగం సభ్యుడు, కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఉంటారు. రాష్ట్ర టాస్క్‌ఫోర్స్, దాని కూర్పు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ గురించి అధికారిక ఉత్తరువును మంగళవారం మధ్యాహ్నం 3 గంటల లోగా జారీ అవుతుందని మమత జూనియర్ వైద్యులకు చెప్పారు.

కాగా, సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ప్రభుత్వం డాక్టర్లను ఆశ్చర్యపరిచింది. సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాతే ప్రత్యక్ష ప్రసారం గురించి తెలుసుకున్నామని వైద్యులు తెలిపారు.