సరిహద్దుల వివాదంలో భారత్ – చైనా కీలక పురోగతి

సరిహద్దుల వివాదంలో భారత్ – చైనా కీలక పురోగతి

తూర్పు ల‌డాఖ్‌ లోని వాస్త‌వాదీన రేఖ వ‌ద్ద పెట్రోలింగ్ నిర్వ‌హించే అంశంలో భార‌తీయ‌, చైనా అధికారుల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైన‌ట్లు తెలుస్తోంది. సరిహద్దు సమస్యపై గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన, దీనిపై ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక పురోగతి కనిపించింది. భారత్ – చైనాల మధ్య సరిహద్దు వివాదంలో కొత్త పురోగతి సాధించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిర్ధారిస్తూ 2020కు ముందు పెట్రోలింగ్ చేస్తున్న ప్రాంతాలలో ఇక నుండి భారత సేనలు పెట్రోలింగ్ సాగిస్తాయని వెల్లడించారు.

పెట్రోలింగ్ అంశంలో ఓ ఒప్పందం కుదిరిన‌ట్లు విదేశాంగ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిశ్రి తెలిపారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత కొన్ని వారాలుగా దౌత్య, సైనిక స్థాయిలో భారతదేశం-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఫలితంగా ఎల్ఓసీ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒక అవగాహన కుదిరిందని తెలిపారు.  బలగాల ఉపసంహరణ, పరిస్థితిని చక్కదిద్దేందుకు పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దీప్‌సాంగ్‌, డెమ్‌చోక్ ప్రాంతాల్లో నిర్వ‌హించే పెట్రోలింగ్ అంశంలో ఒప్పందం కుదిరిన‌ట్లు తెలుస్తోంది.  ఇది 2020లో ఈ ప్రాంతాలలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి దారి తీస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

 
బ్రిక్స్ స‌మావేశాల్లో పాల్గొనేందుకు ర‌ష్యాలోని క‌జాన్ సిటీకి మోదీ వెళ్తున్న నేప‌థ్యంలో  చైనా, భార‌త్ స‌రిహ‌ద్దు అంశంలో ఒప్పందం కుద‌ర‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఆ ఒప్పందంకు సంబంధించి ఇప్పటి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. కానీ బ్రిక్స్ స‌మావేశాల్లో చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్, భార‌త ప్ర‌ధాని మోదీ మ‌ధ్య ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.
 
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో 2020లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అప్పటి ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, చైనా వైపు నుంచి కూడా పలువురు సైనికులు మరణించారు.  తాత్కాలికంగా బలగాలు వెనక్కి వెళ్లినప్పటికీ, రెండు పొరుగుదేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దు సమస్యల పరిష్కారానికి కొన్ని వారులుగా భారత్- చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయి.
 
గత నెల ప్రారంభంలో, తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభనను ముగించడానికి ఘర్షణ పాయింట్ల నుండి దళాలను విడదీయడంపై ఇరుపక్షాలు “భేదాలను తగ్గించి”, “కొంత ఏకాభిప్రాయాన్ని” నిర్మించుకోగలిగాయి. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన తీర్మానాన్ని చేరుకోవడానికి సంభాషణను కొనసాగించడానికి అంగీకరించాయి.
 
సెప్టెంబర్ చివరి వారంలో జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జాంగ్ జియోగాంగ్ మాట్లాడుతూ, “రెండు వైపులా ఆమోదయోగ్యమైన ముందస్తు తేదీలో ఒక తీర్మానాన్ని చేరుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి” తెలిపారు. తూర్పు లడఖ్‌లో నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు, రెండు దేశాల మధ్య సంబంధాలను స్తంభింపజేసేందుకు, మిగిలిన ఘర్షణ పాయింట్ల నుండి ప్రత్యేకించి డెమ్‌చోక్, డెప్‌సాంగ్‌ల మధ్య చర్చలు జరగడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
 
 సెప్టెంబరు 3న, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్, వాంగ్,  భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ల మధ్య చర్చల గురించి వ్యాఖ్యానిస్తూ, “రెండు దేశాల ఫ్రంట్- లైన్ సైన్యాలు చైనా-భారత్ సరిహద్దులోని పశ్చిమ సెక్టార్‌లోని గాల్వన్ వ్యాలీతో సహా నాలుగు ప్రాంతాల నుండి వెనుకకు వెళ్లేందుకు నిర్ణయించాయి” అని చెప్పారు.