తల్లితో పాటు ఏక్తా కపూర్‌పై పోక్సో కేసు

తల్లితో పాటు ఏక్తా కపూర్‌పై పోక్సో కేసు
ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌ చిక్కుల్లో పడ్డారు. ఆల్ట్‌ బాలాజీ బోల్డ్‌ కంటెంట్‌ ‘గంధీభాత్‌’ వెబ్‌ సిరీస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏక్తా కపూర్‌తో పాటు ఆమె తల్లి శోభా కపూర్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  వెబ్‌ సిరీస్‌ సీజన్‌-6లోని ఓ ఎపిసోడ్‌లో మైనర్‌ బాలికల అశ్లీల దృశ్యాల నేపథ్యంలో ఏక్తా కపూర్‌తో పాటు శోభా కపూర్‌పై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ముంబయి బోరివాలిలోని ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  2021 ఫిబ్రవరి- ఏప్రిల్‌ మధ్య ఆల్ట్‌ బాలాజీలో ప్రసారమైన గంధీభాత్‌ వెబ్‌ సిరీస్‌లో మైనర్‌ బాలికలను అభ్యంతరకర సన్నివేశాల్లో చూపించారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.  అయితే, ఈ సిరీస్‌ ప్రసారం నుంచి రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. 
 
ఈ వివాదస్పద ఎపిసోడ్‌ని యాప్‌లో స్ట్రీమింగ్‌ నుంచి తొలగించారు. గొప్ప వ్యక్తులతో పాటు సాధువులను సైతం అవమానించారని సదరు వ్యక్తి ఆరోపించారు. సన్నివేశాలు అభ్యంతరకరమని.. మనోభావాలు దెబ్బతీసేలా ఉందని తెలిపారు. పోక్సో నిబంధనలు ఉల్లంఘించే సన్నివేశాలు ఉన్నాయని అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
 పోక్సోతో పాటు సమాచార సాంకేతిక చట్టం-2000, మహిళా నిషేధ చట్టం 1986, పొగాకు ఉత్పత్తుల చట్టం-2003 తదితర చట్టాలను ఉల్లంఘించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పిల్లలకు సంబంధించి అభ్యంతర కంటెంట్‌పై సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. పిల్లల అశ్లీల కంటెంట్‌ చూసినా.. డౌన్‌లోడ్‌ చేసినా, షేర్‌ చేయడం నేరమేననని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.