నెల రోజుల్లో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం

నెల రోజుల్లో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం
అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చర్లపల్లి టర్మినల్‌ నెల రోజుల్లో ప్రారంభిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.430 కోట్లతో కొనసాగుతున్న చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణ పనులను కిషన్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చర్లపల్లి నంచి హైదరాబాద్‌ నగరంలోకి రోడ్‌ కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు.
 
 “నెల రోజుల్లో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ టర్మినల్‌తో సికింద్రాబాద్ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. టర్మినల్‌ సమీప ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అన్ని రకాల సదుపాయాలతో టర్మినల్ ఏర్పాటైంది. టర్మినన్‌కు రోడ్ల కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి” అని కిషన్ రెడ్డి కోరారు. 
గతంలో కేసీఆర్‌కు చెప్పినా టర్మినల్‌కు వెళ్లే రోడ్లను పట్టించుకోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే కనెక్టివిటీ రోడ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశానని చెబుతూ రోడ్ల కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించామని ప్రభుత్వం చెప్పిందని ఆయన తెలిపారు.
 
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ పనులను 2025 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అంకితం చేస్తారని కేంద్రమంత్రి తెలిపారు. అమృత్‌ పథకంలో భాగంగా స్థానికంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

రూ.430 కోట్లతో చర్లపల్లి, రూ.715 కోట్లతో సికింద్రాబాద్‌, రూ.429 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్‌లలో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రూ.521 కోట్లతో కాజీపేటలో రైల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు
ప్రత్యేక రైల్వే లైన్ నిర్మించి ఎంఎంటీఎస్‌ను పొడిగించినట్లు చెబుతూ దానికి సంబంధించిన నిర్మాణ పనులు త్వరలో చేపడతామని వివరించారు.
 
యాదాద్రితో పాటుగా కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుందని చెబుతూ అది కూడా పూర్తి అయితే యాదాద్రికి, కొమురవెల్లికి ప్రత్యేక ట్రైన్లు నడుస్తాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. కాగా, యాదాద్రికి  ఎంఎంటీఎస్‌ రైళ్లు నడపాలని భక్తులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశ పనులు కొనసాగుతున్నాయి.  ఎంఎంటీఎస్‌ రైళ్లు యాదాద్రి సమీపంలోని రాయగిరి స్టేషన్‌ వరకు పొడగించాలని గత ఏడేళ్ల క్రితమే నిర్ణయించారు. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లు ఉండగా, అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాల్సి ఉంది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.
 
కొన్ని నెలల క్రితం ఘట్‌కేసర్- రాయగిరి రైల్వేలైన్ పూర్తి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు 21 కిలోమీటర్ల మేర కొత్తగా రెండు ఎంఎంటీఎస్ లైన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఘట్‌కేసర్ నుంచి మరో 35 కిలోమీటర్ల మేర కొత్త లైను వేస్తే హైదరాబాద్ నగరం నుంచి కేవలం రూ.20 టిక్కెట్‌తో యాదాద్రి ఆలయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అది కూడా గంటలోపే ప్రయాణం చేయవచ్చు.