జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్లో ప్రస్తుతానికి ఏజెఎస్ యు పార్టీకి 10, జేడీయూకు 2, ఎల్‌జేపీకి ఒక స్థానాన్ని కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ కో ఇన్‌ఛార్జ్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు.
సీట్ల సర్దుబాటు ఒప్పందం ప్రకారం బీజేపీ 68 చోట్ల పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు. అయితే, అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా సహా ప్రత్యర్థి పార్టీలు ఇంకా తమ ప్రణాళికలను వెల్లడించనందున ప్రస్తుతానికి బీజేపి వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తర్వాత సీట్ల సర్దుబాటులో మార్పులు ఉండవచ్చని హిమంత బిశ్వశర్మ చెప్పారు.
కాగా, ఎన్నికల వేళ ఎన్డీయే కు ఊహిచని దెబ్బ తగిలింది. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఆల్ జార్ఖాండ్ స్టూడెంట్స్ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడు ఉమాకాంత్ రజక్, బీజేపీ నేత, జమువా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యే కేదార్ హజ్రాలు జార్ఖాండ్ ముక్తి మోర్చాలో శుక్రవారంనాడు చేరారు. ఈ ఇరువురు నేతలు జేఎంఎం టిక్కెట్‌పై జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని, జమువా సీటు నుంచి కేదర్ హజ్రా బరిలో ఉంటారని భావిస్తున్నారు.
కాంగ్రెస్ నేత మంజు దేవి ఇటీవల ఆపార్టీని వదలి బీజేపీలో చేరారు. ఆమెకు ఈసారి జమువా నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్ ఇస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేదార్ హజ్రా జేఎంఎం పార్టీలోకి చేరాలనే నిర్ణయం తీసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముంజూ దేవిపై కేదార్ హజ్రా 18,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 81 సీట్లకూ తమ కూటమి పోటీ చేస్తుందని జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత వారంలో ప్రకటించారు. పార్టీ పూర్తి ఎన్నికల సన్నద్ధతతో ఉందని, జేఎంఎం కూటమి తిరిగి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమిని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, కాగా, నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరగనుంది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం- కాంగ్రెస్ కూటమి హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు
మహాకుంభమేళాలో ‘సనాతన బోర్డు’ ముసాయిదా