నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా రేవంత్ ప్రభుత్వం

నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా రేవంత్ ప్రభుత్వం

చదువుల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోకుండా పైశాచికంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో కేసులపాల్జేస్తోందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ, అశోక్ నగర్ ను పోలీసు వలయంగా మార్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ విషయంలో నిరుద్యోగులు, గ్రూప్-1 అభ్యర్థుల్లో ఉన్న సందేహాలను తొలగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.  నిరుద్యోగుల సమస్యలపై అనేక రోజులుగా హైకోర్టులో 17 కేసులు పెండింగులో ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.

మరోవంక, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నిరుద్యోగుల పట్ల మొసలికన్నీరు కారుస్తోందని చెబుతూ అధికారంలో ఉన్నపుడు ఒకమాట, అధికారం పోయినంక మరోమాట మాట్లాడటం బీఆర్ఎస్ కు అలవాటే అంటూ ఎద్దేవా చేశారు.  నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని చెబుతూ బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటోందని, కాంగ్రెస్-బీఆర్ఎస్ తోడుదొంగ పార్టీలే అంటూ విమర్శించారు.
 
గతంలో హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న ప్రవళిక అనే నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే మాజీ మంత్రి కేటీఆర్ ఆమె మరణాన్ని అపహాస్యం చేసేలా ప్రేమ వ్యవహారాన్ని అంటగట్టి ఆత్మహత్య ఘటనను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని ఆయన గుర్తు చేశారు.

గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ విషయంలో,  విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్బంధకాండను బిజెపి వ్యతిరేకిస్తోందని డా. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు బిజెపి అండగా ఉంటూ, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేలా పోరాటం చేసేలా బిజెపి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆయన తెలిపారు.