* వాఃయిదా అభ్యర్ధనను తిరస్కరించిన హైకోర్టు డివిజన్ బెంచ్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని అశోక్ నగర్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గ్రూప్-1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని ఆందోళనకు దిగిన అభ్యర్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పోలీసుల దాడుల్లో పలువురు అభ్యర్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవంక, తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.
ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చిన 16 మందిని పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో అశోక్‌నగర్‌లో పోలీసు పహారా కొనసాగుతోంది.
జీవో 29 రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని అభ్యర్థులు తేల్చిచెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అశోక్ నగర్ దద్దరిల్లిపోతోంది. ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు అడుగడుగునా పోలీసులు భారీ మోహరించారు. ఒక ఇద్దరు అభ్యర్థులు కనిపిస్తే చాలు.. వారిని వెంబడించి అరెస్టులు చేస్తున్నారు. ఆందోళనలకు దిగితే లాఠీ దెబ్బలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు వేసిన పిటిషన్లను ఇప్పటికే సింగిల్ బెంచ్ కొట్టివేయగా.. వారు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో యథావిధిగా సోమవారం నుంచి తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్ 9వ తేదీన నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మరోవైపు.. గ్రూప్ 1 అభ్యర్థులు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో 29ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
జీవో 29 వల్ల జరిగే నష్టాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు.. తమ లాయర్ వివరించినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. అయితే అక్టోబర్ 21వ తేదీన మొదటి కేసుగా తీసుకొని విచారిస్తామని సుప్రీంకోర్టు వాయిదా వేసినట్లు తెలిపారు. జీవో 55నే అమలు చేయాలని కోరినా.. సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే లోపే జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
More Stories
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు
సోషల్ మీడియా పాత్రపై విద్యా భారతి సమాలోచనలు
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన