నవంబర్‌ 20న మహారాష్ట్ర, 13-20లలో జార్ఖండ్ ఎన్నికలు

నవంబర్‌ 20న మహారాష్ట్ర, 13-20లలో జార్ఖండ్ ఎన్నికలు
* 48 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించి ఎన్నికల తేదీలను వెల్లడించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా, జార్ఖండ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కూడా వెలువరించింది.
మహారాష్ట్రలో నవంబర్ 20న, ఝార్ఖండ్ లో 13, 20 తేదీలలో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 23న రెండు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకోసం అక్టోబర్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
29వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా, నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్‌ 4 వరకు గడువు ఉంటుంది. ఇక నవంబర్‌ 20న ఎన్నికలు నిర్వహించి, 23న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఈసీ వివరించింది. రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా, లక్షా 186 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా, నవంబర్‌ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది.
మరోవైపు జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. 81 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్‌ 13న ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిని 38 స్థానాలకు నవంబర్‌ 20న ఎన్నికలు ఉంటాయి. ఇక నవంబర్‌ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా,  29,562 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. ఇక వచ్చే ఏడాది జనవరి 5తో జార్ఖండ్‌ అసెంబ్లీ గడువు ముగియనుంది.

కేరళలోని వ‌య‌నాడ్  లోక్‌స‌భ స్థానంతో పాటు దేశ‌వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 47 అసెంబ్లీ స్థానాల‌కు నవంబర్‌ 13న ఉప ఎన్నికలు ఉంటాయని తెలిపింది. ఇందుకోసం అక్టోబర్‌ 18న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 25న నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు కాగా.. నామినేషన్ల ఉపసంహరణకు 30వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. ఇక నవంబర్‌ 13న ఎన్నికలు ఉంటాయి. 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. దీంతోపాటు ఉత్తరాఖండ్‌ లోని కేదార్‌నాథ్‌ అసెంబ్లీ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్‌ లోక్‌ సభ స్థానానికి నవంబర్‌ 20న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 23న ఫలితాలు వెల్లడిస్తారు.

ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్‌ కుమార్‌  మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొత్తం వెబ్‌కాస్టింగ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు సీ విజిల్‌ యాప్‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. మద్యం, డ్రగ్స్‌, కానుకలు పంపిణీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆన్‌లైన్‌ వాలెట్‌లపైనా నిఘా ఉంటుందని.. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలపై నిఘా పెడుతున్నట్లు సీఈసీ తెలిపారు.

మరోవైపు జమ్ము కశ్మీర్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కూడా సీఈసీ రాజీవ్‌ కమార్‌ మాట్లాడారు. ‘జమ్ము కశ్మీర్‌, హర్యానా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం. కశ్మీర్‌ ఎన్నికల నిర్వహణపై ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందాయి. ఉగ్రదాడులకు భయపడకుండా ప్రజలు ఓటేశారు. హింసాత్మక ఘటనలు ఒక్కటీ జరగకుండా ఎన్నికలు నిర్వహించాం. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినా కొందరు విమర్శలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.