కాశ్మీరీ పండిట్‌లు స్వస్థలాలకు తిరిగి రావాల్సిన సమయం

కాశ్మీరీ పండిట్‌లు స్వస్థలాలకు తిరిగి రావాల్సిన సమయం

కాశ్మీరీ పండిట్‌లు, కాశ్మీర్ లోయనుంది బయటకు వెళ్లిన వారందరూ “తమ స్వస్థలాలకు తిరిగి” రావాల్సిన సమయం ఆసన్నమైందని  నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు.  తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రికి ప్రమాణస్వీకారం చేసే ముందు ఆయన ఐక్యతా సందేశం పంపారు. 

వచ్చే వారం ఏర్పడే ఎన్‌సి- కాంగ్రెస్ ప్రభుత్వం “తమ శత్రువు కాదు”, పరిపాలన “అందరినీ వెంట తీసుకెళ్లాలని” కోరుకుంటుందని ఆయన కాశ్మీరీ పండిట్ లకు స్పష్టమైన సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు.  “ఇక్కడి నుండి వెళ్లిన మా అన్నదమ్ములు ఇంటికి తిరిగి వస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది, వారు తమ ఇళ్లకు తిరిగి రావాలి” అంటూ ఆహ్వానం పలికారు.

“మేము కాశ్మీరీ పండిట్‌ల గురించి మాత్రమే ఆలోచించము. మేము జమ్మూ ప్రజల గురించి కూడా ఆలోచిస్తాము. మనం వారిని బాగా చూసుకోవాలి, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం తమ శత్రువు కాదని వారు కూడా భావించాలి. మేం భారతీయులం, అందరినీ వెంట తీసుకెళ్లాలనుకుంటున్నాం’’ అని అబ్దుల్లా విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

కాశ్మీరీ పండిట్‌లు 90వ దశకంలో ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉగ్రవాదం కారణంగా లోయను విడిచి పారిపోవలసి వచ్చింది. వారిలో చాలా మంది జమ్మూ కాశ్మీర్‌లో తమ ఆస్తులను వదిలి దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కాగా, తమ ప్రభుత్వం హిందువులు, ముస్లింల మధ్య ఎటువంటి వివక్షత ప్రదర్సింపదని, అందరినీ సమానంగా చూస్తోందని చెబుతూ కాశ్మీర్ లో అందరికి చోటు ఉందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర హోదా పునరుద్ధరణకై తమ డిమాండ్ ను పునరుద్ఘాటిస్తూ “రాష్ట్రం పనిచేయాలంటే” ఇది తప్పనిసరి అని అని స్పష్టం చేశారు. “ఇక్కడ అతిపెద్ద సమస్య నిరుద్యోగం… జమ్మూ కాశ్మీర్‌ను ఏకం చేయడం,  ఈ ఎన్నికల్లో విస్తరించిన ద్వేషాన్ని అంతం చేయడం మా ప్రాధాన్యత. రాష్ట్రం పనిచేయాలంటే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలి…’’ అని ఆయన తెలిపారు.