పాక్ బాంబులు చెక్కుచెదరని తనోట్‌ మాత దేవాలయం

పాక్ బాంబులు చెక్కుచెదరని తనోట్‌ మాత దేవాలయం

ఆది పరాశక్తి అనేక రూపాల్లో భక్తులకు అభయమిస్తుందనడానికి భారత్‌- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న తనోట్‌ మాత దేవాలయం నిదర్శనంగా నిలుస్తుంది. యుద్ధ సమయంలో జరిగిన బాంబు దాడుల నుంచి భారత జవాన్లను తనోట్‌ మాత కాపాడినట్లు స్థానికులు విశ్వసిస్తారు. అమ్మవారిపై అపార నమ్మకంతో ఈ ఆలయంలో ఏర్పాట్లన్నీ బీఎస్ఎఫ్ జవాన్లే స్వయంగా చూసుకుంటారు.

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో పాకిస్థాన్ సరిహద్దుకు సమీపాన తనోట్‌ మాత దేవాలయం ఉంది. అష్టాదశ శక్తి పీఠాల్లో పాక్‌లోని బలూచిస్థాన్లో వెలిసిన హింగ్లాజ్‌ మాత అవతారమే తనోట్‌ మాత అని చరన్‌ సాహిత్యం తెలుపుతుంది. రాజపుత్ర వంశానికి చెందిన రాజు తానురావు తనోట్‌ మాత ఆలయాన్ని 13 శతాబ్దాల క్రితం నిర్మించారు. 

ఇప్పటికీ ఆ రాజ వంశస్థులు ఈ ఆలయంలో పూజలు చేస్తారు. 1971లో భారత్‌-పాక్‌ యుద్ధానంతరం అమ్మవారి ఆలయం సరిహద్దు భద్రతాదళం- బిఎస్ఎఫ్ నిర్వహణలోకి వెళ్లింది. దేవాలయ ప్రాంగణాన్ని మరింత విస్తరించిన సైనికులు భారత విజయాలకు గుర్తుగా అక్కడ ఒక విజయ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. నవరాత్రులతో పాటు పాక్‌పై విజయానికి గుర్తుగా ఏటా అక్కడ జవాన్లు ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు.

1965, 1971 పాక్‌తో జరిగిన యుద్ధాలకు తనోట్‌ మాత ఆలయం సాక్ష్యంగా నిలిచింది. యుద్ధ సమయంలో అమ్మవారి మహిమ కారణంగానే పాక్‌పై భారత సైన్యం పైచేయి సాధించినట్టు స్థానికులు విశ్వసిస్తారు. ఆలయం వద్ద కొద్దిమంది సైనికులు మాత్రమే విధుల్లో ఉండటాన్ని ఆసరా చేసుకొని 1965 యుద్ధంలో పాక్‌ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు భారీ ప్రణాళికతో సిద్ధమైంది. 

ఆలయ పరిధిలో ఉన్న భారత జవాన్లపైకి పాక్‌ బాంబుల వర్షం కురిపించింది. తనోట్‌ మాత దేవాలయంపైకి పాక్‌ పంపిన సుమారు 450 బాంబుల్లో ఒక్కటి కూడా పేలలేదని, ఇది అమ్మవారి అద్భుత శక్తికి నిదర్శనమని స్థానికులు విశ్వసిస్తారు. అక్కడ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి పేలని బాంబులను అందులో ఉంచి సందర్శకులు వీక్షించేందుకు అవకాశం కల్పించారు.

 ఆ ఆలయంలో రుమాలుతో ముడుపులు కట్టి కోరికలు తీరిన తర్వాత భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 1965 యుద్ధ సమయంలో అమ్మవారి మహిమలు వెలుగులోకి రావడం వల్ల అప్పటి నుంచి తనోట్‌ మాత ఆలయాన్ని వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో సందర్శిస్తున్నారు.