భారత్​ను ఒక ముప్పుగా చూపేందుకు బంగ్లాదేశ్​లో కుట్ర

భారత్​ను ఒక ముప్పుగా చూపేందుకు బంగ్లాదేశ్​లో కుట్ర
భారత్​ను ఒక ముప్పుగా చూపించేందుకు బంగ్లాదేశ్​లో కుట్రలు జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  (ఆర్​ఎస్​ఎస్​) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్​హెచ్చరించారు. భారత్ నుండి తమకు ముప్పు ఏర్పడుతుందనే సాకు చూపుతూ అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్ తో స్నేహం చేయడం ద్వారా భారత్ ను కట్టడి చేయవచ్చని ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న వ్యక్తుల నుండి వస్తున్న వాదనలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో విజయదశమి ఉత్సవంలో   పూజ చేసిన మోహన్ భగవత్​ బంగ్లాదేశ్​లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
అటువంటి కధనాలు వ్యాప్తి చేయడం వెనుక ఉన్న అంతర్జాతీయ శక్తుల గురించి మనకు తెలుసని స్పష్టం చేశారు. వారి పేర్లను ప్రస్తావించనవసరం లేదంటూ వారి ఉద్దేశయం అంతా అటువంటి అరాచక పరిస్థితులను భారత్ లో సృష్టించటనే అని ఆయన హెచ్చరించారు. అటువంటి శక్తుల ఆగడాలను సాగనీయరాదని తేల్చి చెప్పారు.
“మన సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. హిందువులను శత్రువులుగా చూసే పరిస్థితి తీసుకువస్తున్నారు. మన సంకల్పాన్ని బలహీన పరిచేందుకు, భారత్​ను అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారు” అని మోహన్ భగవత్​ ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్​లో నిరంకుశ ఛాందసవాదం రాజ్యమేలుతోందని ఆరోపించారు.

అక్కడి హిందువులతో సహా మైనారిటీల తలలపై కత్తి వేలాడుతోందని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత అక్కడ నెలకొన్న పరిణామాలు ప్రతి హిందువునూ ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఒక్క హిందువులు మాత్రమే కాకుండా బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న ప్రతి మైనారిటీ కూడా దాడుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి రాజకీయ పరిణామాలను హిందువులపై దాడులకు ఉపయోగించుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు.అక్కడ హిందువులపై అఘాయిత్యాలకు పాల్పడే సంప్రదాయం పునరావృతమైందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో హిందువులు ఏకతాటిపైకి రావడం, సమైక్యంగా రోడ్ల మీదికి వచ్చి ఉద్యమించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని చెప్పారు. ర్యాడికల్ భావజాలంతో హిందువులందరూ సంఘటితమయ్యారని, తమ రక్షణ కోసం రోడ్లపైకి వచ్చారని చెప్పారు. హిందువులకే కాదు, మైనారిటీలందరికీ భారత్ సహాయం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

అయితే బంగ్లాదేశ్ నిర్మాణంలో భారతదేశం కీలకంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. మరి అలాంటి బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా భారత్ ఎలా పని చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఎప్పటికీ అలా వ్యవహారించదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించారు. అయితే ఈ తరహా కథనాలు చేస్తున్న వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హిందువులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఐక్యంగా శక్తిమంతం కావాల్సిన అవసరం ఉందని, బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న అఘాయిత్యాలు, దురాగతాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాలని మోహన్‌ భగవత్‌ కోరారు. బలహీనంగా ఉండడమనేది నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ఆయన హిందువులకు సూచించారు. మనం బలహీనంగా ఉంటే మాత్రం దుర్మార్గుల దురాగతాలను ఆహ్వానించడమేనని పేర్కొంటూ ఈ విషయాన్ని హిందువులు గుర్తించాలని చెప్పారు.

సమాజంలో అరాచకం, భయాందోళనల వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న సమూహాలపై అప్రమత్తంగా ఉండాలని డా. భగవత్ హెచ్చరించారు.  ఈ రోజుల్లో ‘డీప్ స్టేట్’, ‘వోకీయిజం’, ‘కల్చరల్ మార్క్సిస్ట్’ వంటి పదాలు చర్చలో ఉన్నాయని చెబుతూ  వారు అన్ని సంస్కృతీ సంప్రదాయాలకు ప్రకటిత శత్రువులని స్పష్టం చేసారు. విలువలు, సంప్రదాయాలు, ఏది ధర్మం- శుభప్రదమైనదిగా పరిగణించబడుతుందో దానిని నాశనం చేయడం ఈ సమూహం  కార్యనిర్వహణలో ఒక భాగం అని విమర్శించారు.

ఈ పద్ధతి మొదటి దశ సమాజంలోని మనస్సును రూపొందించే వ్యవస్థలు, సంస్థలను ఒకరి ప్రభావంలోకి తీసుకురావడం అంటూ ఉదాహరణకు, విద్యావ్యవస్థ,  విద్యాసంస్థలు, మీడియా, మేధో సంభాషణ మొదలైనవని చెప్పారు. ఆ తర్వాత ఆలోచనలను, విలువలను నాశనం చేయడం, వారి ద్వారా సమాజపు నమ్మకాలను వమ్ము చేయడంగా వివరించారు. 

మహిళలపై అకృత్యాలపై మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్​కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన మన సమాజానికి సిగ్గుచేటని చెప్పారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. నేరం జరిగి ఇంతకాలమైనా, బాధితురాలికి న్యాయం జరగకపోవడం సమాజాన్ని తీవ్రంగా నిరుత్సాహపరుస్తోందని అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
సమాజంలో విభేదాలు అనేవి ఉండకూడదని చెబుతూ ప్రపంచదేశాల్లో భారత్ ఖ్యాతి పొందిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భారతదేశం వైవిధ్యమైన దేశమని తెలిపారు. ఈ దేశానికి అదే బలమని ఆయన అభివర్ణించారు. కొంత మందికి భారతదేశ పురోగతిపై సమస్యలు ఉన్నాయంటూ ఆయన పరోక్ష విమర్శలు చేశారు.  కులం, భాష, ప్రాంతం మొదలైన వాటి ఆధారంగా సమాజంలో చీలికలను సృష్టించే అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత హితవు చెప్పారు.  ప్రజలను కోరారు. సమాజం చిన్నచిన్న సమస్యలపై దృష్టి సారిస్తూనే ఉంటూ,  ఆలస్యం అయ్యే వరకు వారి తలలపైకి దూసుకుపోతున్న సంక్షోభాన్ని అర్థం చేసుకోదని హెచ్చరించారు.
 
“దేశంలో ఎటువంటి కారణం లేకుండా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే సంఘటనలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. పరిస్థితి లేదా విధానాల గురించి మనస్సులో అసంతృప్తి ఉండవచ్చు.  కానీ దానిని వ్యక్తీకరించడానికి, వాటిని వ్యతిరేకించడానికి ప్రజాస్వామ్య మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలను అనుసరించకుండా, హింసను ఆశ్రయించడం, సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గంపై దాడి చేయడం, కారణం లేకుండా హింసను ఆశ్రయించడం, భయాన్ని సృష్టించడానికి ప్రయత్నించడం, గూండాయిజం, దీనిని ప్రేరేపించడానికి లేదా ప్రణాళికాబద్ధంగా చేయడానికి చేసే ప్రయత్నాలను ‘అరాచకత్వానికి వ్యాకరణం’ అంటా” అని ఆయన తెలిపారు.
 
ఇటీవలి గణేశోత్సవంలో జరిగిన దౌర్జన్యాలను ప్రస్తావిస్తూ దోషులను తక్షణమే నియంత్రించి శిక్షించవలసి ఉంటుందని చెప్పారు. కానీ వారు వచ్చే వరకు, సమాజం తన ప్రియమైనవారి ప్రాణాలతో పాటు తన ఆస్తిని రక్షించుకోవాలని సూచించారు. అందువల్ల, సమాజం ఎల్లప్పుడూ పూర్తిగా అప్రమత్తంగా, సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ దుష్ట ధోరణులను, వాటికి మద్దతు ఇచ్చేవారిని గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు.