తమిళనాడులోని చెన్నై శివారులో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు సమీపంలోని కవరైప్పెట్టై వద్ద ఆగివున్న గూడ్స్ రైలును మైసూర్ – దర్బంగా బాగమతి ఎక్స్‌ప్రెస్ వెనుకనుంచి ఢకొీట్టింది. ఈ ఘటనలో రెండు బోగీల నుంచి మంటలు చెలరేగాయి. 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 19 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.
తమిళనాడు మంత్రి ఎస్‌ఎం నాసర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. 19 మందిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని, 16 మందికి స్వల్పగాయాలయ్యాయని మంత్రి చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అధికారులు అంబులెన్స్‌లు, రెస్క్యూ వాహనాలను అందుబాటులో ఉంచారు.
ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు వీలుగా బస్సులు, తాగునీరు వంటి మౌలిక వసతులను సిద్ధం చేసినట్లు తిరువళ్లూరు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో నెల్లూరు – చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైళ్లను దారిమళ్లించారు. శుక్రవారం రాత్రి 8.27 గంటల సమయంలో పొన్నేరి స్టేషన్ దాటిన రైలుకు కవరైప్పెట్టె స్టేషన్‌లో మెయిన్ లైన్‌లో వెళ్లేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చారు. ఆ స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో భారీ కుదుపు ఏర్పడినట్లు రైలు సిబ్బంది గుర్తించారు.
అనంతరం మెయిన్ లైన్‌లో వెళ్లాల్సిన రైలు లూప్ లైన్‌లో వెళ్లి ఆగివున్న గూడ్స్ రైలును ఢకొీట్టినట్టు అధికారులు తెలిపారు. చెన్నై రైల్వే డివిజన్ అధికారులు ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్లు 04425354151, 04424354995 ఏర్పాటు చేశారు. ప్రమాదానికి గురైన రైలులోని ప్రయాణికులను ఇఎంయు రైలులో చెన్నై సెంట్రల్‌కు తరలిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. అక్కడి నుంచి దర్బంగా వరకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పారు. ప్రయాణికులకు ఉచితంగా ఆహారం, నీళ్లు అందిస్తామన్నారు.
More Stories
మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దు
రష్యా నుండి 4 బిలియన్ల డాలర్ల లాంగ్ రేంజ్ రేడార్ సిస్టమ్
ఢిల్లీలోని 40కు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు