జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు జవాన్ల కిడ్నాప్, ఒకరి హత్య

జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు జవాన్ల కిడ్నాప్, ఒకరి హత్య
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఏకంగా ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేయడం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల చెర నుంచి ఒక జవాన్ తప్పించుకుని బయటపడగా, మరో జవాన్‌ను మాత్రం ఉగ్రవాదులు చంపేశారు. చనిపోయిన సైనికుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. 
 
ఈ విషయం తెలుసుకున్న భారత సైన్యం ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. ఇటీవలె జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా ఆ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ అటవీ ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్‌ చేపట్టిన టెరిటోరియల్‌ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేయడం సంచలనం రేపుతోంది. ఇద్దరు సైనికుల్లో ఒక జవాన్‌ చాకచక్యంగా ఉగ్రవాదుల నుంచి తప్పించుకున్నాడు. మరో జవాన్‌ కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టగా,  అతడి మృతదేహం లభ్యం అయింది.

 
ఇక ఉగ్రవాదుల చేతిలో కిడ్నాప్‌కు గురైన ఇద్దరు టెరిటోరియల్ ఆర్మీ జవాన్లను హిలాల్ అహ్మద్ భట్, ఫయాజ్ అహ్మద్ షేక్‌లుగా గుర్తించారు. హిలాల్ అహ్మద్ భట్ అనంత్‌నాగ్ జిల్లా ముక్దంపోరా నౌగామ్‌ వాసిగా గుర్తించారు.  తప్పించుకున్న ఫయాజ్ అహ్మద్ షేక్ భుజం, ఎడమ కాలికి గాయాలు కావడంతో చికిత్స కోసం శ్రీనగర్‌లోని 92 బేస్ హాస్పిటల్‌కు తరలించారు. 
 
వీరిద్దరూ టెరిటోరియ్ ఆర్మీ 162 యూనిట్‌కు చెందినవారిగా గుర్తించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఇక ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం సైన్యం రంగంలోకి దిగి అనంత్‌నాగ్ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.
 
ఇక ఈ ఏడాది ఆగస్ట్ నెలలో అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు అమరులు కాగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. అంతకు ముందు దొడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పోలీస్‌ అధికారి అమరులయ్యారు. ఇక జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఓ పాకిస్తాన్‌ పౌరుడిని అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్‌ఎఫ్ వెల్లడించింది.