ర‌సాయ‌శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

ర‌సాయ‌శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి ఈ ఏడాది ముగ్గురుని వరించింది. ప్రోటీన్‌పై అధ్యయనం నిర్వహించిన డేవిడ్‌ బాకర్‌, డెమిస్‌ హస్సాబిస్‌, జాన్‌ ఎం. జంపర్‌లకు అవార్డును ప్రకటించినట్లు బుధవారం నోబెల్‌ బృందం తెలిపింది.  

నోబెల్ పుర‌స్కారంలో స‌గం భాగం డేవిడ్ బేక‌ర్ శాస్త్ర‌వేత్త‌కు ల‌భించింది. కాంపుట్యూష‌న‌ల్‌ ప్రొటీన్ డిజైన్ చేసినందుకు అత‌నికి ఆ అవార్డును ప్ర‌క‌టించారు. ఇక మరో స‌గం అవార్డును ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌ల‌కు ఇచ్చారు. ప్రొటీన్ నిర్మాణాన్ని అంచ‌నా వేసిన డేమిస్ హ‌స్సాబిస్‌, జాన్ ఎం జంప‌ర్‌ల‌కు స‌గం నోబెల్ పుర‌స్కారాన్ని కేటాయించారు.

 ”పూర్తిగా కొత్త రకాల ప్రొటీన్లను నిర్మించడంలో దాదాపు అసాధ్యమైన చర్య”ని పూర్తి చేసిన డేవిడ్ బేకర్‌కి, ప్రొటీన్ల సంక్లిష్ట నిర్మాణాలను అంచనా వేయడానికి  ఏఐ మోడల్‌ను అభివృద్ధి  చేసిన  డెమిస్‌ హస్సాబిస్‌, జాన్‌ ఎం. జంపర్‌‌లు  అవార్డును పంచుకోనున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తెలిపింది.   

గత  50 సంవత్సరాలుగా క్లిష్టంగా ఉన్న   ఈ సమస్యను వీరు పరిష్కరించారని ప్రశంసించింది. ఈ యేటి నోబెల్ విజేత‌లు.. ప్రోటీన్లలో దాగిన సీక్రెట్ల‌ను ప‌సిక‌ట్టారు. కంప్యూటింగ్, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రోటీన్ల ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. డెమిస్‌, జాన్‌లు.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాదాపు అన్ని ప్రోటీన్ల‌ను అధ్యనం చేశారు.

డేవిడ్‌ బేకర్‌ ప్రస్తుతం వాషింగ్టన్‌ యూనివర్సిటీలో పని చేస్తుండగా డెమిస్‌ హస్సబిస్‌, జాన్‌ జంపర్‌ లండన్‌లోని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ అయిన గూగుల్‌ డీప్‌మైండ్‌లో పని చేస్తున్నారు. 2003లో బేకర్‌ ఒక ఊహాత్మక ప్రొటీన్‌ను తయారుచేశారని, ఈ సాంకేతికతతో సృష్టించిన ప్రొటీన్లను ఔషధాలు, వ్యాక్సిన్లు, నానోమెటీరియల్స్‌, సూక్ష్మ సెన్సార్లలో వాడుతున్నట్టు నోబెల్‌ కమిటీ తెలిపింది. 20 కోట్ల ప్రొటీన్ల నిర్మాణ శైలిని గుర్తించేలా హస్సబిస్‌, జంపర్‌ ఒక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నమూనాను తయారు చేసినట్టు పేర్కొన్నది.

గతేడాది కూడా రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. క్వాంటం డాట్‌ల ఆవిష్కరణ ,విశ్లేషణకు సంబంధించి మౌంగి జి. బవాండి, లూయిస్‌ ఇ. బ్రస్‌, అలెక్సీ ఎల్‌. ఎకిమోవ్‌లకు అందించారు. ర‌సాయ‌న‌శాస్త్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు నోబెల్ పుర‌స్కారాన్ని 115 సార్లు ప్ర‌క‌టించారు. ఆ అవార్డును 194 మంది సొంతం చేసుకున్నారు. 1901 నుంచి 2023 వ‌ర‌కు కెమిస్ట్రీలో నోబెల్ పుర‌స్కారాన్ని అంద‌జేశారు. ఫ్రెడ్రిక్ సాంగ‌ర్‌, బ్యారీ షార్ప్‌లెస్ శాస్త్ర‌వేత్త‌లు రెండు సార్లు కెమిస్ట్రీలో అవార్డుల‌ను అందుకున్నారు.