పొరుగు దేశం శ్రీలంకలో తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఉవ్విళ్లూరుతున్న అదానీ గ్రూప్‌నకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత ప్రభుత్వ పెద్దలతో అదానీ గ్రూప్ చేసుకొన్న లోపాయికారి ఒప్పందాలపై అనూరకుమార దిసనాయకే నేతృత్వంలోని శ్రీలంక కొత్త ప్రభుత్వం కన్నెర్రజేసింది. అదానీ గ్రూప్ దొడ్డిదారిన విండ్ పవర్‌ప్లాంటు కాంట్రాక్టు చేజిక్కించుకొన్నదన్న ఆరోపణలపై దృష్టి సారించింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీతో చేసుకొన్న విండ్ పవర్ ఒప్పందంపై పునఃసమీక్షిస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి విజితా హెరాత్ మంగళవారం ప్రకటించారు. ఇది లోపాయికారి ఒప్పందమేనని తెలిపారు. నవంబర్ 14న జరుగనున్న పార్లమెంటరీ ఎన్నికల అనంతరం దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తామని వివరించారు. కాగా తాను అధికారంలోకి వస్తే, శ్రీలంక ప్రయోజనాలకు నష్టాన్ని కలిగిస్తున్న అదానీ విండ్ డీల్‌ను రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలో దిసనాయకే ప్రకటించారు.
మరోవంక, శ్రీలంకలోని మన్నార్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ పవర్‌ప్లాంటును పోటీ లేకుండా అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో, అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా లంక పౌరులు పెద్దయెత్తున నిరసనలు తెలిపారు. వీధుల్లోకి వచ్చి ఆందోళనలను ఉధృతం చేశారు. అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సోషల్‌మీడియాను హోరెత్తించారు.
మన్నార్‌లో 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంటును నిర్మించి నిర్వహించి అప్పగించేలా 25 ఏండ్ల కాలానికి సీఈబీతో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకొన్నది. ఎంవోయూ సమయంలో యూనిట్ విద్యుత్తును 6.50 అమెరికన్ సెంట్లకు సీఈబీకి విక్రయించేలా ఒప్పందం కుదిరింది. కొంతకాలానికి ఈ ధరను అదానీ గ్రూప్ 7.55 సెంట్లకు పెంచేసింది. ఈ ప్లాంటును అంతర్జాతీయ పోటీ బిడ్ల ద్వారా అప్పగిస్తే 4 సెంట్లకే యూనిట్ విద్యుత్తు వచ్చేదని శ్రీలంక ఇంజినీర్లు చెప్తున్నారు.
పోటీ లేకపోవటంతో అదానీ గ్రూప్‌కు 25 ఏండ్లలో 4 బిలియన్ అమెరికన్ డాలర్ల అయాచిత లాభం చేకూరుతుందని అంచనా వేశారు. ఇది లంక ప్రజలకు ఆర్థిక భారమేనని తేల్చిచెప్పారు. దీంతో ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని అప్పటి నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం