రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇలా చేయడం ఇది పదోసారి. ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రేపో రేటును 6.5శాతం వద్దే ఉంచుతున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరకు ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పారు.
సమృద్ధిగా వర్షాలు పడ్డాయని, బఫర్ స్టాక్ కూడా కావాల్సినంత ఉందని చెబుతూ ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. వడ్డీ రేట్లపై చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ వడ్డీ రేట్లను కూడా తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచేందుకు నిర్ణయించారు.
దీంతో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి కూడా ఎలాంటి ఉపశమనం లభించదు. డిసెంబర్ సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుందని శక్తికాంత దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఐ ద్రవ్యోల్బణం రేటు 4.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.
రెండో త్రైమాసికం నుంచి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టనుంది. క్యూ3లో ద్రవ్యోల్బణం అంచనా 4.7 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. క్యూ4లో ద్రవ్యోల్బణం రేటు 4.3 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గింది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం రేటు 4.4 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ అంచనా వేసింది.
2013 ఆర్థిక సంవత్సరం తర్వాత తొలిసారిగా పెట్టుబడులలో జీడీపీ వాటా రికార్డు స్థాయిలో ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 2025 ఆర్థి సంవత్సరం కోసం జీడీపీ 7.2 శాతంగా అంచనా వేశారు. అదే సమయంలో 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనా 7.3 శాతానికి పెరిగింది. ఇది అంతకుముందు 7.2 శాతంగా ఉంది. 2025 క్యూ2 కోసం జీడీపీ వృద్ధి అంచనా కూడా 7.2 శాతం నుండి 7 శాతానికి తగ్గించారు. 2025 క్యూ3 వృద్ధి అంచనాలు పెంచారు. 2025 క్యూ4 కోసం ఆర్థిక వృద్ధి అంచనా కూడా 7.2 శాతం నుండి 7.4 శాతానికి పెరిగింది.
More Stories
త్వరలోనే నీటితో నడిచే హైడ్రోజన్ రైలు
హైదరాబాద్ లోనూ అమెరికా అధ్యక్షుడి స్కై స్క్రేపర్స్!
ఎయిర్ ఇండియా- విస్తారా విలీనం పూర్తి