రూ.1,800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం

రూ.1,800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం
డ్రగ్స్‌ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), గుజరాత్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్‌) అధికారులు రైడ్‌ చేశారు. రూ.1,800 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. 
 
భోపాల్ సమీపంలోని ఫ్యాక్టరీలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్‌)తో కలిసి సంయుక్తంగా ఆ ఫ్యాక్టరీపై రైడ్‌ చేశారు. ఆ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న ఎండీ (మెఫెడ్రోన్) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలో అక్రమంగా మత్తు పదార్థాలు ఉత్పత్తి చేస్తున్న ఇద్దరు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు.
 
కాగా, గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ ఈ విషయాన్ని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన ఫొటోలను కూడా అందులో పోస్ట్‌ చేశారు. డ్రగ్స్‌పై పోరాటంలో భారీ విజయం సాధించిన గుజరాత్ ఏటీఎస్‌, ఢిల్లీ ఎన్సీబీని ఆయన అభినందించారు. మాదక ద్రవ్యాలు, వాటి అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో చట్ట సంస్థల అవిశ్రాంత ప్రయత్నాలకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. మన సమాజం ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో వారి సహకార ప్రయత్నాలు చాలా కీలకమని కొనియాడారు.
 
రూ. 5,000 కోట్ల విలువ గల అతిపెద్ద డ్రగ్ రికవరీతో ఢిల్లీలో అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌ను ఛేదించిన వెంటనే భోపాల్ లో ఇది పట్టుబడటం గమనార్హం. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ 560 కిలోగ్రాముల కొకైన్ మరియు 40 కిలోగ్రాముల హైడ్రోపోనిక్ గంజాయిని జప్తు చేసింది, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మొత్తం విలువ సుమారు రూ. 5,600 కోట్లు.
 
ఈ ఆపరేషన్ దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో ప్రధాన డిస్ట్రిబ్యూటర్ తుషార్ గోయల్‌తో పాటు సహచరులు హిమాన్షు కుమార్, ఔరంగజేబ్ సిద్ధిఖీ, భరత్ కుమార్ జైన్‌లతో సహా నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడానికి దారితీసింది. అదనపు పోలీసు కమిషనర్ (స్పెషల్ సెల్) పిఎస్ కుష్వా ప్రకారం, గోయల్ భారతదేశం అంతటా నిర్వహిస్తున్న అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌లో కీలక వ్యక్తిగా ప్రసిద్ది చెందాడు.
 
కొకైన్‌ను స్వీకరించేందుకు ముంబై నుంచి వెళ్లిన జైన్‌ను అక్టోబర్ 1న మహిపాల్‌పూర్‌లోని గోదాం వెలుపల ఇతరులతో పాటు పట్టుకున్నారు. కాగా, ఈ డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తికి కాంగ్రెస్ నాయకులతో సంబంధాలు ఉన్నాయని బిజెపి నేతలు ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయంగా కూడా కలకలం రేపింది. దానితో ఈడీ రంగప్రవేశం చేసి డ్రగ్ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుల దర్యాప్తును ప్రారంభించింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సంబంధిత ఎఫ్‌ఐఆర్‌లు, పత్రాలను ఈడీకి బదిలీ చేసింది.
 
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మహారాష్ట్ర పర్యటన సందర్భంగా డ్రగ్స్ దందా నిధులను కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేయడం గమనార్హం. ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఉద్దేశించే ప్రధాని ఈ ఆరోపణలు చేశారు.