స్టాక్‌ మార్కెట్లలో రూ.11లక్షల కోట్ల సంపద ఆవిరి

స్టాక్‌ మార్కెట్లలో రూ.11లక్షల కోట్ల సంపద ఆవిరి
* భారత్ లో ఆయిల్ ధరలు పెరుగుతాయా?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు దేశీయ మార్కెట్లపై ప్రభావం పడింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేయడంతో యుద్ధ వాతావరణ నెలకొన్నది. ఈ క్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు నష్టాల్లో ఊభిలోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ రెండుశాతానికిపైగా పడిపోగా దాదాపు రూ.11లక్షలకోట్లకుపైగా మదుపరుల సంపద ఆవిరైంది. 
 
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు ముడి చమురు ధరలు పెరిగాయి. ఇక బీఎస్‌ఈలో లిస్ట్‌ అయిన అన్ని కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5.63లక్షల కోట్లు తగ్గి రూ.469 కోట్లకు పడిపోయింది. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 83,002.09 మొదలైంది. మొదట్లోనే 1,250 పాయింట్లకుపైగా నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలైంది. ఆ తర్వాత మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 82,434.02 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది.
 
చివరకు 1,769.19 పాయింట్ల నష్టంతో 82,497.10 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 546.80 పాయింట్లు పతనమై.. 25,250.10 వద్ద ముగిసింది. ఇటీవల వరుస లాభాలతో స్టాక్‌ మార్కెట్లు కొత్త రికార్డులను సృష్టిస్తూ వచ్చాయి. దాదాపు రెండు నెలల అనంతరం పతనమ్యాయి. ట్రేడింగ్‌లో దాదాపు 1,077 షేర్లు పురోగమించగా.. 2740 షేర్లు పతనమయ్యాయి.
 
నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో బీపీసీఎల్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. రియాల్టీ 4.5 శాతం, ఆటో, బ్యాంక్, మీడియా, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్ ఇండెక్స్ 2నుంచి 3శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 2శాతం చొప్పున పతనమయ్యాయి.
కాగా, బ్రెండ్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 75 డాలర్ల మార్క్‌ను దాటింది. బెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ క్రూడ్‌ సైతం 72 డాలర్లకు చేరింది. వాస్తవానికి ఇటీవల క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పతనమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్‌లో చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. 
 
ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మిసైల్స్‌తో విరుచుకు పడడంతో రెండు దేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆయిల్‌ సరఫరాపై పెను ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 75 డాలర్లకు చేరింది. గత రెండు మూడు రోజుల్లో చమురు ధరలు 5శాతం వరకు పెరిగాయి. ఇరాన్‌ రోజుకు 1.5 మిలియన్‌ బ్యారెల్స్‌ ఉత్పత్తి చేస్తున్నది.
 
ఇజ్రాయెల్‌ దాడులకు తెగబడితే ఇంధన ఉత్పత్తిపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉందని సిటీ గ్రూప్‌ ఇంక్‌ నివేదిక పేర్కొంది. వాస్తవానికి క్రూడాయిల్‌ ధర హెచ్చుతగ్గులకు లోనవుతుంది. సెప్టెంబర్‌ 27న సైతం ధర పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడ్రాయిల్‌ ధరల పెరుగుదలతో భారత్‌లో చమురు ధరలు పెరుగుతాయా? అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. 
 
అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఎలా ఉంటాయో కొంత కాలం వేచి చూడాల్సిందేనని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు మొన్నటి వరకు భారీగా పడిపోయాయి.  ఈ క్రమంలో దాంతో ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌పై భారీగానే ఆదాయాన్ని పొందాయి. ఈ క్రమంలోనే త్వరలోనే లీటర్‌కు రూ.3 నుంచి రూ.4 వరకు తగ్గించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. యుద్ధ భయం నేపథ్యంలో ధరలు పెరుగుతాయా? లేక తగ్గుతాయా? అన్నదానిపై వేచి చూడాల్సిందే.