పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో హత్యాచారానికి గురైన బాధిత ట్రైనీ డాక్టర్ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. ‘క్రై ఆఫ్ ది హవర్’ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. దీంతో ఈ అంశంపై మరో వివాదం చెలరేగింది. కళాకారుడు అసిత్ సైన్ ‘క్రై ఆఫ్ ది హవర్’ పేరుతో ఒక విగ్రహాన్ని రూపొందించారు.
ఒక మహిళ ఏడుస్తున్నట్లుగా ఉన్న ఈ విగ్రహం జీవితంలోని చివరి నిమిషాల్లో బాధితురాలు పడిన వేదన, భయానక స్థితిని ప్రతిబింబిస్తున్నదని పేర్కొన్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయం ఉన్న భవనం సమీపంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, బాధితురాలిని అగౌరవ పరిచేలా, చాలా అసహ్యకరంగా ఈ విగ్రహం ఉందని కొందరు విమర్శించారు.
అత్యాచార బాధితురాలి విగ్రహాన్ని దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? అని ఒకరు ప్రశ్నించారు. ”ఇది బాధితురాలి విగ్రహం కాదు. ఘటన సమయంలో ఆమె అనుభవించిన వేదన, హింసకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశాం” అని తెలిపారు. దీనికి సంబంధించిన చిత్రాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో ఇవి కాస్తా వైరల్‌గా మారాయి.
ఈ విగ్రహం ఏర్పాటు వెనుక ఉద్దేశం మంచిదే అయినప్పటికీ నెట్టింట దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ”ఇది బాధితురాలిని అవమానించడమే. ఓ అత్యాచార బాధితురాలిని ఆధారంగా చేసుకుని ఇలాంటి విగ్రహాలను ఎలా ఏర్పాటు చేస్తారు? ఇది మంచి సలహా అని ఎవరు చెప్పారు? దీన్ని ఎవరు ఆమోదించారు?” అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత కునాల్ ఘోష్ కూడా ఈ విగ్రహంపై స్పందిస్తూ బాధితురాలి పేరు, గుర్తింపును వెల్లడించ కూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఇది విరుద్ధమని విమర్శించారు. ‘బాధ్యతాయుతులైన వారెవరూ అలా చేయరు. కళ పేరుతో కూడా చేయలేరు. నిరసనలు, న్యాయం కోసం డిమాండ్లు ఉన్నాయి. కానీ బాధతో కూడిన అమ్మాయి ముఖంతో విగ్రహం సరైనది కాదు. బాధితురాలి ఫొటోలు లేదా విగ్రహాలు వినియోగించకూడదని మార్గదర్శకాలు ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు.
మరోవైపు ఆర్జీ కర్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ దేబ్‌దత్ ఈ విగ్రహం గురించి మీడియాతో మాట్లాడుతూ తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేయలేదని స్పష్టం చేశారు. ‘ఈ విగ్రహం బాధితురాలిది కాదు. కానీ ఆమె అనుభవించిన నొప్పి, హింస, కొనసాగుతున్న నిరసనలకు చిహ్నం’ అని పేర్కొన్నారు.
ఇది కేవలం సింబాలిక్ శిల్పమని, ఆ రోజు ఏమి జరిగిందో, ఆమె పడిన బాధను అధికారులకు చూపించాలనుకుంటున్నామని తెలిపారు. బాధితురాలికి న్యాయం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.
More Stories
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్