శీతాకాలం రాజధాని జమ్మూతోసహా ఏడు జిల్లాల వ్యాప్తంగా 40 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. కాగా, కొద్దీ నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఈ జిల్లాల్లో 66.78 శాతం పోలింగ్ జరిగింది.
2019లో రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్‌తోపాటు, పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులతోసహా 415 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 39.18 లక్షలకు పైగా ఓటర్లు నిర్ణయించనున్నారు.
అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసి) వెంబడి ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ కేంద్రాలతోసహా అన్ని నియోజకవర్గాలలోని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించలేదని ఎన్నికల కమిషన్ తెలిపింది.
ఆర్టికల్ 370 అధికరణం రద్దు కారణంగా తొలిసారి ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకీ సమాజ్, గోర్ఖా సామాజిక వర్గం ఓటర్లు ముందుగానే లైన్లలో నిల్చొన్నారు. ఇది ‘చరిత్రాత్మక సందర్భమ’ని వారు అన్నారు. కశ్మీరీ శరణార్థుల కోసం ఢిల్లీలో నాలుగు, ఉధంపూర్ జిల్లాలో ఒకటి, జమ్మూలో 19, మొత్తం 24 ప్రత్యేక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల కోసం 400కుపైగా కంపెనీల దళాలను నియమించారు.
ఉధంపూర్ జిల్లాలో అత్యధికంగా 72.91 శాతం వరకు పోలింగ్ నమోదయింది. తర్వాతి స్థానాలలో వరుసగా సంబా(72.41 శాతం), కథువా(70.53 శాతం), జమ్మూ(66.79 శాతం), బండిపొరా(63.33 శాతం), కుప్వారా(62.76 శాతం), బారాముల్లా(55.73 శాతం) జిల్లాలు ఉన్నాయి. నియోజకవర్గాలలో జమ్మూ జిల్లాలోని ఛంబాలో అత్యధికంగా 77.35 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా ఉగ్రవాద, వేర్పాటువాద ప్రాబల్య సోపోర్ నియోజకవర్గంలో 41.44 శాతం నమోదైంది.
ఇలా ఉండగా, నిరాశ్రయులైన వేలాదిమంది కాశ్మీరీ పండితులు ఇక్కడ కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం తమను తిరిగి కాశ్మీర్ లోయకు వెళ్లే అవకాశం కల్పిస్తుందని ఆశాభావంతో పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారు. గతం 35 ఏళ్లుగా తిరిగి స్వస్థలాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తూ జమ్మూ, ఢిల్లీలలో నివసిస్తున్నారు.
More Stories
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్
ఉత్కంఠ పోరులో పాక్ పై భారత్ జయకేతనం
హర్యానాలో కాంగ్రెస్ అంటున్న ఎగ్జిట్ పోల్స్.. బిజెపి ధీమా