ఇషా ఫౌండేషన్‌లో తనిఖీల్లో అసిస్టెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు. ఫౌండేషన్ ప్రాంగణాన్ని తనిఖీ చేస్తున్నప్పుడు అక్కడే ఉండేవారి భద్రత, శ్రేయస్సు గురించి కూడా అధికారులు ఆరా తీశారు.
రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ప్రతిస్పందనగా దర్యాప్తు మెుదలైంది. తన ఇద్దరు కుమార్తెలను కేంద్రంలో వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఉంచారని కామరాజ్ ఆరోపించారు. ఇషా ఫౌండేషన్ వ్యక్తుల బ్రెయిన్‌వాష్ చేసి, వారిని సన్యాసులుగా మారుస్తోందని, వారి కుటుంబాలతో సంబంధాలు కొనసాగించకుండా అడ్డుకుంటున్నదని తెలిపారు.
జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణ్యం, వి.శివజ్ఞానంలతో కూడిన ధర్మాసనం ఇషా ఫౌండేషన్‌లోని పద్ధతులపై ప్రశ్నలను లేవనెత్తింది. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసి స్థిరపడేలా చేశారని, కానీ యువతులను సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహించారని కోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ తరపు న్యాయవాది కూడా ఫౌండేషన్‌పై అనేక క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఇషా యోగా సెంటర్‌కు సంబంధించిన ఒక వైద్యుడిపై పోక్సో చట్టం కింద కేసు బుక్ అయిన విషయాన్ని కూడా తెలిపారు.
అయితే కోర్టు విచారణ సందర్భంగా కామరాజ్ కుమార్తెలు తాము స్వచ్ఛందంగా యోగా కేంద్రంలో నివాసం ఉంటున్నామని కోర్టుకు తెలిపారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మీకు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం పాపంగా కనిపించడం లేదా అని వారిని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులపై సమగ్ర స్టేటస్ రిపోర్టును సమర్పించేందుకు ప్రభుత్వానికి అక్టోబర్ 4వ తేదీని కోర్టు గడువు విధించింది.
‘హైకోర్టు ఆదేశాల మేరకు ఇషా యోగా కేంద్రంలో విచారణ చేపట్టాం. సాంఘిక సంక్షేమ శాఖ, శిశు సంక్షేమ కమిటీ తదితర అధికారులు కూడా విచారణలో పాల్గొన్నారు. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నాం. విచారణ ఇంకా కొనసాగనుంది. నివేదికను కోర్టులో దాఖలు చేస్తాం.’ కోయంబత్తూరు జిల్లా ఎస్పీ కె. కార్తికేయన్ తెలిపారు.
మరోవైపు ఇషా ఫౌండేషన్ ఆరోపణలను నిరాధారమైనవని తోసిపుచ్చుతూ ప్రకటన విడుదల చేసింది. ‘ఈషా ఫౌండేషన్ ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించడానికి సద్గురుతో మెుదలైంది. వ్యక్తులు తమ మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ, జ్ఞానం కలిగి ఉంటారని మేం నమ్ముతున్నాం.’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
More Stories
సచివాలయంపై నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్
ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలి విగ్రహంపై దుమారం
మణిపూర్‌లో తొలిసారి హత్తుకున్న మైతీ, కుకీలు