కులతత్వంతో దేశభక్తిని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం

కులతత్వంతో దేశభక్తిని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం
దేశంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశ దేశభక్తిని దెబ్బతీయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు..  అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పాల్వాల్‌లో మంగళవారం జరిగిన తన చివరి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని కాంగ్రస్ అనుమతిపలేదని, జమ్మూ కాశ్మీర్ లో రాజ్యాంగం పూర్తిగా అమలు పరచేందుకు ఒప్పుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు.
 
పార్లమెంట్ లో మన సోదరీమణులకు రేజర్వేషన్లు కల్పించలేదని, ముస్లిం సోదరీమణులకు ట్రిపుల్ తలాక్ నుండి విముక్తి కలిగించలేదని ఆయన గుర్తు చేశారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం పట్ల దృష్టి సారింపకుండా కాంగ్రెస్ ఎప్పుడూ తన కుటుంభం కోసమే ఆరాటపడుతోందని ప్రధాని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ రాజకీయాలు అబద్ధపు వాగ్దానాలకే పరిమితమని, కాని బిజెపి రాజకీయాలు కష్టపడి పనిచేసి ఫలితాన్ని సాధించడంతో కూడుకున్నవని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.  రాష్ట్రంలో వరుసగా మూడవసారి బిజెపి అధికారంలోకి రానున్నదని ధీమా వ్యక్తం చేశారు.

తమను ఆశీర్వదించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని ఆయన చెప్పారు. జమ్మూ కశ్మీరులో జరుగుతున్న చివరి విడత పోలింగ్‌లో అక్కడి ప్రజలు ప్రజాస్వామ్య పండుగలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో బిజెపి ప్రభంజనం కనపడుతోందని, ప్రతి చోట భరోసా దిల్ సే..బిజెపి ఫిర్‌సే అని ముక్తకంఠంతో వినపడుతోందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌కు కష్టపడే అలవాటు లేదని, పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నాము కాబట్టి హర్యానా ప్రజలు తమకు బంగారు పళ్లెంతో అధికారాన్ని అప్పగిస్తారని కాంగ్రెస్ కలలు కంటోందని ఆయన ఎద్దేవా చేశారు. మధ్య ప్రదేశ్‌లో కూడా ఇదే కరమైన భావనతో కాంగ్రెస్ ఉందని, ముందుగానే విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారని, కాని ఓటింగ్ రోజున ప్రజలు ఆ పార్టీకి పగలే చుక్కలు చూపించారని ప్రధాని గుర్తు చేశారు. 

హర్యానాకు పొరుగున ఉన్న రాజస్థాన్‌లో కూడా బిజెపికి వ్యతిరేకంగా రైతులు, యువతను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పెద్ద ప్రయత్నమే చేసిందని, కాని చివరకు కాంగ్రెస్ బొక్కబోర్లాపడిందని ఆయన చెప్పారు. హర్యానాలో కూడా కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. హర్యానా ప్రజలు కాంగ్రెస్‌ను అధికారానికి దూరంగా పెడతారని, ఇక్కడ కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత పోరును ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. 

పవిత్రమైన భగవద్గీతను మనకు అందచేసిన హర్యానా కష్టపడి పనిచేసే తత్వాన్ని కూడా బోధించిందని, కాని తాను పనిచేయకపోవడమే కాక ఇతరులను కూడా పనిచేయనివ్వకపోవడం కాంగ్రెస్ తత్వమని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే ఉండడం హర్యానాలో ఆనవాయితీగా వస్తోందని, ఢిల్లీలో మూడవసారి బిజెపిని అధికారంలోకి తెచ్చిన హర్యానా ప్రజలు ఇక్కడ కూడా మూడవసారి బిజెపిని అధికారంలోకి తెస్తున్నారని ఆయన జోస్యం చెప్పారు.