బీఆర్ఎస్ కార్యకర్తలే మంత్రి సురేఖపై ట్రోలింగ్ చేశారు

బీఆర్ఎస్ కార్యకర్తలే మంత్రి సురేఖపై ట్రోలింగ్ చేశారు
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, తనపై తప్పుడు పోస్టులు పెట్టింది బీఆర్ఎస్ నేతలేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా ఒక తమ్ముడిగా మంత్రి సురేఖకు కండువా కప్పానని, దాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుగా ప్రచారం చేశారని రఘునందన్ మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాకు తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం తెలియకుండా సంస్కారహీనంగా పోస్టులు పెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొండా సురేఖ తొలిసారి దుబ్బాకకు కల్యాణ్‌ లక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీకి వచ్చినందుకు ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేసినట్లు ఆయన చెప్పారు.

అలాంటి నూలు పోగు దండను ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా వేశానని గుర్తు చేశారు. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని రఘునందన్‌ రావు తెలిపారు. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తానని బిజెపి ఎంపీ హెచ్చరించారు. 

పోస్టు పెట్టిన అకౌంట్కు హరీశ్రావు, కేసీఆర్‌ ఫోటో ఉందని పేర్కొంటూ బీఆర్‌ఎస్‌కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదని విమర్శించారు. పోస్టులు పెట్టిన వారు మీ వాళ్లు అయితే తీసుకొచ్చి పోలీసులకు అప్పగించండని ఆయన డిమాండ్‌ చేశారు. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే వచ్చి మీరు కూడా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్రావును ఉదేశిస్తూ సవాల్ చేశారు.

`గతంలో ప్రధాని నరేంద్రమోదీకి కూడా నూలు పోగు దండ వేశాను. అలానే ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశాను. కానీ కొందరు అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం తెలియకుండా సంస్కారహీనంగా పోస్టులు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఉన్న ఫొటో, హరీశ్రావు, కేటీఆర్ ఫొటోలున్న అకౌంట్ నుంచి ఈ పోస్టులు పెట్టారు. వెంటనే కేటీఆర్, హరీశ్రావు స్పందించి చర్యలు తీసుకోవాలి’ అని రఘునందన్ రావు డిమాండ్ చేశారు

కేటీఆర్, హరీశ్రావు దీనిపై స్పందించి సోషల్ మీడియాను కంట్రోల్ చేసుకుని క్షమాపణ చెప్పాలని రఘునందన్‌ రావు డిమాండ్ చేశారు. వ్యక్తుల వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదని ఆయన హితవు చెప్పారు. మహిళల మీద బీఆర్‌ఎస్‌కు గౌరవం లేదని అంటూ తెలంగాణ తొలి కేబినెట్లో మహిళలకు చోటు ఇవ్వలేదని గుర్తు చేశారు. 

బీఆర్ఎస్ పార్టీ నుంచే డబ్బుల తీసుకున్న వారు ఇలాంటి ట్రోలింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలే ట్రోలింగ్ చేశారని ఆయన స్పష్టం చేశారు.తన వల్ల అక్క సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ ఆయన విచారం వ్యక్తం చేశారు.