తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన కుమారుడు, ప్రస్తుత మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు. మరో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరితో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చెన్నైలోని రాజ్‌భవన్‌లో ఆదివారంనాడు ప్రమాణస్వీకారం చేయించారు.
ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా హాజరయ్యారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఇటీవల మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిలుపై విడుదలైన వి.సెంథిల్ బాలాజీతో పాటు ఆర్.రాజేంద్రన్ (సేలం-నార్త్) గోవి చెళియన్ (తిరవిడైమరుదూరు), ఎస్.ఎం నాజర్ (అవడి) ఉన్నారు.
కాగా, సెంథిల్‌కు విద్యుత్, ఎక్సైజ్ శాఖలను కేటాయించగా, గోవి చెళియన్‌కు సాంకేతిక విద్య, ఎలక్ట్రానిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీతో సహా హైయర్ ఎడ్యుకేషన్ శాఖను కేటాయించారు. నాజర్‌కు మైనారిటీ వ్యవహారాలు, ఆర్.రాజేంద్రన్‌కు పర్యాటక శాఖను ప్రభుత్వం కేటాయించినట్టు రాజ్‌భవన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖను నిర్వహిస్తున్నారు. ప్లానింగ్ అండ్ డవపల్‌మెంట్ శాఖ పర్యవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. మంత్రివర్గ పునర్వవస్థీకరణలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు.
కాగా, డీఎంకే, తమిళనాడు కొత్త ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై బీజేపీ విరుచుకుపడింది. ఆయనకు ముఖ్యమంత్రి కుమారుడిగా తప్ప ఎటువంటి అర్హత లేదని పేర్కొంది. డిఎంకె ప్రజా సంక్షేమం కంటే కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందని పేర్కొంటూ బిజెపి ఈ నియామకాన్ని బంధుప్రీతిగా విమర్శించింది.
బీజేపీ అధికార ప్రతినిధి ఏఎన్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కంటే కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ తమిళనాడు ప్రయోజనాలకు ద్రోహం చేయడంతో పార్టీ 75 ఏళ్ల చరిత్ర నిలిచిపోయిందని ధ్వజమెత్తింది.
అంతకుముందు చెన్నైలోని కరుణానిధి మెమోరియల్ వద్ద ఉదయనిధి స్టాలిన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉదయనిధి ముఖ్యమంత్రి, మంత్రులు తనకు పెద్ద బాధ్యత అప్పగించారని చెప్పారు. వారి నమ్మకాన్ని కాపాడుకునేలా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన విమర్శలపై కూడా స్పందిస్తూ విమర్శలు ఎప్పుడూ ఉంటాయని, అయితే, వాటన్నింటినీ తీసుకుని సాధ్యమైనంత వరకు ప్రజలకు మంచి చేస్తానని తెలిపారు. తన పనితోనే విమర్శలకు సమాధానమిస్తానని చెప్పారు.
More Stories
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్
ఉత్కంఠ పోరులో పాక్ పై భారత్ జయకేతనం
హర్యానాలో కాంగ్రెస్ అంటున్న ఎగ్జిట్ పోల్స్.. బిజెపి ధీమా