ఎన్నికల సభలో ప్రసంగిస్తూ సొమ్మసిల్లిన ఖర్గే

ఎన్నికల సభలో ప్రసంగిస్తూ సొమ్మసిల్లిన ఖర్గే
* టెలిఫోన్ లో ప్రధాని మోదీ పరామర్శ
 
కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కళ్లు తిరుగడంతో పడిపోబోయారు. ఖర్గే పరిస్థితిని గమనించిన కాంగ్రెస్‌ నేతలు వెంటనే ఆయనను పట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ లో ఆయన ఆరోగ్యం గురించి పరామర్శించారు.
 
జమ్ముకశ్మీర్‌లోని కతువాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై మండిపడ్డారు.  ‘ఈ వ్యక్తులు (కేంద్ర ప్రభుత్వం) ఎన్నడూ ఎన్నికలు నిర్వహించాలని కోరుకోలేదు. సుప్రీంకోర్టు ఆదేశం తర్వాతే ఎన్నికలకు సిద్ధమయ్యారు. వారికి ఎన్నికలు అవసరం లేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నిర్వహించాలనుకున్నారు’ అని విమర్శించారు.
 
 ప్రధాని మోదీ పదేళ్లలో భారతీయ యువతకు ఏమీ ఇవ్వలేదని ఆరోపించారు. ‘పదేళ్లలో మీ శ్రేయస్సును తిరిగి తీసుకురాలేని వ్యక్తిని మీరు నమ్ముతారా? బీజేపీ నేత మీ ముందుకు వస్తే మీ శ్రేయస్సు గురించి అడగండి’ అని చెప్పారు.
 
కాగా, మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ అస్వస్థతకు గురయ్యారు. బీపీ పడిపోవడంతో ఆయనకు కళ్లు తిరిగాయి. వేదికపై ఉన్న కాంగ్రెస్‌ నేతలు దీనిని గమనించారు. వెంటనే ఆయన వద్దకు చేరుకుని పట్టుకున్నారు. అయినప్పటికీ ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు.  పార్టీ నేతలు ఆయనను పట్టుకుని నిలబడి ఉండగా ప్రసంగాన్ని కొనసాగించారు.
 
జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడానికి తాము పోరాడుతామని స్పష్టం చేశారు. ‘నాకు 83 ఏళ్లు. నేను అంత త్వరగా చనిపోను, ప్రధాని మోదీని అధికారం నుంచి తొలగించే వరకు నేను బతికే ఉంటాను’ అని చెప్పారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు ఖర్గేను ఆయన సీటు వద్దకు తీసుకెళ్లారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
 
అయితే మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురైన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వెంటనే పార్టీ అగ్రనాయకత్వం జమ్ముకశ్మీర్‌ నేతలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. అనంతరం కఠువా ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం పార్టీ నాయకులు ఖర్గేని తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు- బీపీ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే సోషల్ మీడియాలో వెల్లడించారు.
 
“జస్రోతాలో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు చేసింది. బీపీ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించింది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రజల ఆశీస్సులతో ఆయన బలంగా ముందుకు వెళ్తారు. ఆయన సంకల్పం కూడా అలానే ఉంటుంది” అని ప్రియాంక ఖర్గే ట్వీట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రి నుంచి మల్లికార్జున ఖర్గే ఆదివారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు.