హైదరాబాద్ లో విచ్చలవిడిగా నాటు తుపాకులు

హైదరాబాద్ లో విచ్చలవిడిగా నాటు తుపాకులు

నాటు తుపాకులతో హైదరాబాద్ మహానగరం నిండిపోయింది. తుపాకుల మీద వ్యామోహంతో కొందరు కొనుగోలు చేస్తుండగా, కొందరు ప్రత్యర్థుల లేకుండా చేసేందుకు కొందరు కొనుగోలు చేస్తున్నారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యక్తులు, సులభంగా డబ్బులు సంపాదించవచ్చని ప్లాన్ వేసి బీహార్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ అవసరం ఉన్న వారికి ఎక్కువ డబ్బులకు విక్రయిస్తున్నారు. 

ముఖ్యంగా బీహార్ రాష్ట్రానికి వెళ్లి వారికి కావాల్సిన తుపాకీని కొనుగోలు చేసి తీసుకుని వస్తున్నారు. వాటిని చూపించి కొందరు బెదిరింపులకు పాల్పడుతుండడంతో మరికొందరు కాల్పులు జరిపి ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా కాల్పుల సంఘటనలు జరుగుతున్నాయి. పాతబస్తీలో కొంత కాలం క్రితం ఆస్తి వివాదంలో ఓ న్యాయవాది కాల్పులు జరపడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు, ప్రాణాలు పోలేదు. 

మియాపూర్‌లో ఓ హోటల్ జనరల్ మేనేజర్ దేబేందర్ గయాన్‌పై రతీష్ నాయర్ కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఉద్యోగం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో నిందితుడు బీహార్‌కు వెళ్లి నాటు తుపాకీ కొనుగోలు చేసి తీసుకుని వచ్చి మరీ కాల్పులు జరిపాడు. నాటు తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు. 

నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా బీహార్ రాష్ట్రం వెళ్లి తుపాకీ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చినట్లు ఒప్పుకున్నాడు. రియల్ ఎస్టేట్ గొడవ కారణంగా కార్వాన్‌కు చెందిన ఆకాష్ సింగ్‌ను అతడి ప్రత్యార్థులు ఇంటికి పిలిచి మరీ కాల్పులు జరిపారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనలో నిందితులు బీహార్ రాష్ట్రం నుంచి నాటుతుపాకీని కొనుగోలు చేసి తీసుకుని వచ్చారు. 

రాచకొండ పోలీసులు ఎపికి చెందిన సాయిరాం రెడ్డిని అరెస్టు చేసి ఏడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. చిన్న చిన్న నేరాలు చేసే సాయిరాం సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. తనకు పరిచయమైన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి సాయంతో తక్కువ ధరకు గన్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయించాలని తీసుకుని వచ్చాడు. గన్స్ కొనుగోలు చేసే వారి కోసం ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

మరోవైపు కొందరు కూలీలు పనిచేసేందుకు నగరానికి వచ్చి నాటు పిస్తోల్‌లను విక్రయిస్తున్నారు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు పనిచేసేందుకు హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. వారు కొంత కాలం తర్వాత తమ రాష్ట్రానికి వెళ్లి నాటు తుపాకులను తక్కువ డబ్బులకు కొనుగోలు చేసి తీసుకుని వస్తున్నారు. ఇక్కడ అవసరం ఉన్న వారికి ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. 

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ షాబుద్దిన్ అన్సారీ నిర్మాణ రంగంలో కూలీగా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు సొంత రాష్ట్రానికి వెళ్లి తక్కువ ధరకు పిస్తోల్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చాడు. దానిని ఎక్కువ ధరకు విక్రయించేందుకు చూస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.