* శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల 196వ జన్మదినోత్సవ ప్రత్యేకం
భగవంతుడితో ఐక్యత స్వయంకృషితో సాధ్యమవుతుంది, అంతే కానీ మతసంబంధ విశ్వాసాల వలన లేక ఒక విశ్వనియంత యొక్క ఏకపక్ష సంకల్పం వల్ల కాదు.” ఈ గంభీరమైన హామీ ఏదో తాత్విక వైరాగ్యంతో అన్నది కాక, పై లక్ష్య సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన యోగావతారులైన లాహిరీ మహాశయుల సజీవ సాక్ష్యం.
శ్యామా చరణ్ లాహిరీ 1828, సెప్టెంబర్ 30 న — ధార్మిక గ్రంథాలలో ‘యోగిరాజు’గా సంబోధింపబడే శివుడి పరమ భక్తునికి కుమారుడుగా జన్మించారు. తన బాల్యంలో లాహిరీ మహాశయులు హిందీ, ఉర్దూ, సంస్కృతం, బెంగాలీ, ఫ్రెంచ్ ఇంకా ఆంగ్లమూ చదువుకున్నారు. ఆయన వేదాలను చాలా వరకు అధ్యయనం చేశారు, విద్వత్తు కలిగిన పండితులు చేసే ధార్మిక చర్చలను శ్రద్ధగా వినేవారు.
మృదు స్వభావి, కరుణామయుడు, ధైర్యశాలి అయిన ఈ యువకుడికి సంప్రదాయాన్ననుసరించి 1846లో కాశీమణి గారితో వివాహం జరిగింది. వేదసంప్రదాయాన్ననుసరించి ఆయన గృహస్థాశ్రమాన్ని అనుసరించారు. ఈ దంపతులకు నలుగురు సంతానం కలిగారు. 1851 లో ఆయనకు 23 ఏళ్ల వయసప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజనీరింగ్ విభాగంలో అకౌంటెంట్ గా నియమితులయ్యారు.
ఆయనలోని నిజాయితీ, నిబద్ధత తన జీవితపు అన్ని అంశాల పైనా ప్రసరించి, ఆయన నిరాడంబర జీవనం భగవంతుడి దృష్టిలో ఔన్నత్యం సాధించడమే కాక, ఒక కార్యాలయ చిరు ఉద్యోగిగా కూడా ఆయన ఘనతను సాధించారు.
1861 చలికాలంలో, ఆయన ముప్ఫయి మూడవ ఏట జరిగిన ఒక కీలక సంఘటన అప్పటివరకూ ‘సాధారణం’ గా ఉన్న లాహిరీ మహాశయుల జీవిత ప్రయాణ దిశలో ఒక్కసారిగా మార్పు తెచ్చింది. అది మానవ జాతి ఆధ్యాత్మిక అక్షంలో ఒక బృహత్ పరిణామాన్ని సంభవింపజేసింది. లాహిరీ మహాశయులు హిమాలయ పర్వత పాద ప్రాంతంలోని రాణిఖేత్ కు బదిలీ అయ్యారు.
ఒక మధ్యాహ్నం పూట ద్రోణగిరి పర్వత ప్రాంతంలో కొండల మధ్య నడుస్తున్న సమయంలో ఆయన మరణం లేని హిమాలయ యోగి — మహావతార్ బాబాజీని ఆశ్చర్యకరమైన రీతిలో కలుసుకున్నారు. అత్యాశ్చర్యానికి గురైన ఈ యువకుడికి — తనను రాణిఖేత్ కు బదిలీ చేసే విధంగా ఆయన పై అధికారికి మానసిక సందేశాన్ని పంపినది తానేనని — బాబాజీ నిగూఢంగా తెలిపారు.
“ఎవరయినా, మానవజాతితో తన ఏకత్వాన్ని అనుభూతి కావించుకున్నప్పుడు అన్ని మనస్సులూ అతనికి ప్రసారణ కేంద్రాలవుతాయి; వాటి ద్వారా అతడు ఇచ్ఛానుసారంగా పనిచేస్తాడు.”
తన గత జన్మకు చెందిన కొన్ని నిగూఢ వివరాలు వెల్లడించాక బాబాజీ దిగ్భ్రమలో ఉన్న ఆ యువకుడికి మరుగున పడిన ప్రాచీన క్రియాయోగ శాస్త్రంలో దీక్ష ఇచ్చారు. ఆ అద్భుత సంఘటన సవివరంగా శ్రీ శ్రీ పరమహంస యోగానంద అత్యధికంగా విక్రయించబడే ఆధ్యాత్మిక గ్రంథరాజం ‘ఒక యోగి ఆత్మకథ’ లోని ‘హిమాలయాల్లో మహాభవన సృష్టి‘ అనే అధ్యాయంలో వర్ణించారు.
యోగానంద తల్లిదండ్రులు లాహిరీ మహాశయుల శిష్యులు, ఇంకా ఆయన పసివాడుగా ఉండగా లాహిరీ మహాశయులు ఆయనను దీవించారు. సంవత్సరాలు గడిచాక యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.), సెల్ఫ్-రియలైజెషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) లను ఒక శతాబ్దానికంటే పూర్వం స్థాపించడం ద్వారా క్రియాయోగ పవిత్ర విజ్ఞానాన్ని వ్యాప్తి చెందించే బాధ్యతను యోగానంద తన భుజానికెత్తుకున్నారు.
యువకుడైన లాహిరీ మహాశయులు నిరాఘాటంగా ఏడు రోజులపాటు తమ గురువుగారి పాదాల వద్ద నిర్వికల్ప సమాధిలోని బ్రహ్మానంద స్థితిలో ఉండిపోయారు. ఎనిమిదవ రోజు ఆ ఏకాంత పర్వత ప్రాంతాల్లో తమ గురువు గారితో పాటు ఎప్పటికీ ఉండిపోవడానికి తనకు అనుమతినిమ్మని లాహిరీ మహాశయులు బాబాజీని వేడుకొన్నారు. కానీ కరుణామయుడైన ఆయన గురువుగారు తన శిష్యుడి కోసం సమున్నత ప్రణాళిక సిద్ధంచేసి ఉంచారు.
“నీ జీవితం, ఆదర్శ గృహస్థయోగికి నిదర్శనంగా సేవచేస్తూ నగర జనసమూహాల మధ్య గడవాలి… సంసార బంధాలతో, భారమైన లౌకిక విధులతో చిక్కులు పడుతున్న లక్షలాది జనం, తమలాగే సంసారివైన నీ నుంచి కొత్త ఆశ పొందుతారు… నీ సంతులిత జీవనం నుంచి వాళ్ళు, మోక్షమన్నది అంతస్సన్యాసం మీదే కాని బాహ్య సన్యాసం మీద ఆధారపడ్డది కాదని అర్థం చేసుకుంటారు.”
ఆ విధంగా లాహిరీ మహాశయుల సామరస్యతతో కూడిన గృహస్థ జీవితం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆయన క్రియాయోగ దీక్ష అనే కానుకను అన్ని మతాల వారికీ ఇచ్చారు. ఆయన తమ కాలంలో ఎంతో గట్టిగా పాదుకొని ఉన్న కుల భేదాలను అధిగమించడానికి అనవరతం శ్రమించారు. ఈ యోగావతారులు తరచూ తన శిష్యులను ఇలా ప్రోత్సహించే వారు. “బనత్, బనత్, బన్ జాయ్ “…. శ్రమిస్తూ, శ్రమిస్తూ, చూడు! అదిగో! దివ్యలక్ష్యం!”
మరింత సమాచారం కోసం: yssofindia.org
More Stories
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా గద్దలతో ‘ఈగల్ స్కాడ్’
ఉత్కంఠ పోరులో పాక్ పై భారత్ జయకేతనం