గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తరువులకు విరుద్ధంగా శని, ఆదివారాలలో కూల్చివేతలు చేబడుతున్న హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో కూల్చివేతలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సోమవారం విచారణ జరిగింది. విచారణకు హైడ్రా కమిషనర్ రంగానథ్ వర్చువల్‌గా, అమీన్‌పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు.
శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం మీరు ఎందుకు పని చేయాలని ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా కూల్చివేస్తున్నారని అడిగింది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్‌ను ప్రశ్నించింది.
వాదనల సందర్భంగా తహసీల్దార్ విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నామని రంగనాథ్ హైకోర్టుకు తెలపడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తహసీల్దార్ అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా? ఆయన చెబితే చార్మినార్, హైకోర్టును కూడా కూల్చేస్తారా? ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముంది? పొలిటికల్ బాస్‌లను సంతృప్తిపరిచేందుకు, పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయొద్దు అంటూ హెచ్చరించింది.
చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా? ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా? అంటూ “అధికారులు చట్టవ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు.. జాగ్రత్త” అని హైకోర్టు హెచ్చరించింది. పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పనిచేయొద్దని హితవు చెప్పింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. చట్టవ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు జాగ్రత్త అని మందలిస్తూ ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రాకు ఇదే విధేంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందన్నారు. కూల్చివేతలు తప్ప వేరే పాలసి లేదని, ఇది ప్రజల అభిప్రాయమని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని.. హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పండి అంటూ కమిషనర్‌ను గట్టిగా నిలదీసింది ధర్మాసనం. అక్రమ కట్టడాలు కడుతుంటే నిలుపుదల చేయాలని.. లేదా సీజ్ చేయాలని… కానీ నిబంధనలు ఉల్లగించి ఆదివారం కూల్చడం ఏంటి అని ప్రశ్నించింది. హైడ్రా కమిషనర్ వాదనలకు న్యాయస్థానం ఏకభవించలేదు. కూల్చివేతలకు సంబంధించి వీడియోలు ఫైల్ చెయాలని… నిబంధనలు ఫాలో అవుతూ కూల్చాలని హైడ్రా, తహసీల్దార్‌కు సూచించింది.
More Stories
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు
హైదరాబాద్ నుండి నేరుగా గోవాకు రైలు ప్రారంభం