ముంబయికి ఉగ్రముప్పు హెచ్చరికలు

ముంబయికి ఉగ్రముప్పు హెచ్చరికలు

* బెంగళూర్ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు బాంబు బెదిరింపులు

దేశ వాణిజ్య రాజధాని ముంబయికి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబయి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రార్థనా మందిరాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు.  అంతేకాదు మాక్‌ డ్రిల్స్‌ కూడా నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

వివిధ నగరాలకు చెందిన డీసీపీలు (డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్) తమ జోన్లలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.  ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం వస్తే, ముందు జాగ్రత్త చర్యగా తమకు తెలియజేయాలని పేర్కొన్నారు. వివిధ ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు.

ముంబయిలోని రెండు ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్న క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు.  అయితే, పండుగల సీజన్‌ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 10 రోజులపాటు గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న ముంబై వాసులు ఇప్పుడు దుర్గాపూజ, దసరా, దీపావళి పండగలు సిద్ధమవుతున్నట్లు గుర్తు చేశారు.

ఈ సమయంలో ఉగ్రముప్పు హెచ్చరికలు రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అంతే కాకుండా 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఉగ్ర ముప్పు హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

మరోవంక, తాజ్‌ గ్రూప్‌కు చెందిన ప్రముఖ హోటల్‌కు బాంబు బెదిరింపులు  కలకలం రేపుతున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌కు శనివారం తెల్లవారుజామున బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. 

ప్రముఖ రాజకీయ నాయకులు, క్రికెటర్లకు ఆతిథ్యం ఇచ్చే ఈ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన హోటల్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు బాంబ్‌ స్వ్కాడ్, డాగ్‌ స్వ్కాడ్‌ సాయంతో హోటల్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినట్లు సెంట్రల్‌ బెంగళూరు డీసీపీ శేఖర్‌ తెలిపారు. 

ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ కనిపించలేదని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి ఈమెయిల్‌ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.