వివాదాలతో జగన్‌ తిరుమల పర్యటన రద్దు

వివాదాలతో జగన్‌ తిరుమల పర్యటన రద్దు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్‌ అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే గుడిలోకి అడుగుపెట్టాలని హిందూ సంఘాలు సహా, కూటమి నేతలు డిమాండ్ చేస్తుండడంతో ఆయన వెనకడుగు వేసిన్నట్లు తెలిసింది.
 
శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయించుకోవడంతో అన్య మతస్తుడు కావడంతో వైఎస్‌ జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాతనే తిరుమలలో అడుగుపెట్టాలని కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్‌ చేశాయి. వైసీపీ నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. 
 
ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని డిక్లరేషన్‌ ఎలా అడుగుతారని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రశ్నించారు. జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వరని స్పష్టం చేస్తూ ఇందులో రాజకీయ కుట్ర కోణం ఉందని ఆరోపించారు. పైగా, డిక్లరేషన్ పేరుతో జగన్ ను తిరుమలలో అడుగు పెట్టనీయని పక్షంలో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. ఇలా అనవసర రాద్దాంతం జరుగుతుండటంతో తన తిరుమల పర్యటనను జగన్‌ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
 
జగన్‌ పర్యటన రద్దుకు కొద్ది నిమిషాల ముందే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. అత్యంత పవిత్రంగా భావించే తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, శ్రీవారి సన్నిధికి వచ్చే ప్రతి భక్తుడూ టీటీడీ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు.  శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. తద్వారా పరోక్షంగా జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అనే సంకేతాలు ఇచ్చారు.
 
కాగా, భూమన కరుణాకర్‌ రెడ్డి వ్యాఖ్యలపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి లేదని చెప్పే హక్కు లేదని భూమన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. డిక్లరేషన్‌ ఇవ్వకపోతే అలిపిరి వద్ద జగన్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు.
 
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ తేల్చి చెప్పారు. జగన్‌ ఏనాడైనా ఆయన సతీమణిని శ్రీవారి దర్శనానికి తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. మన ఇంట్లో పూజ చేస్తేనే పక్కన భార్య ఉండేట్లు చూసుకుంటామని గుర్తు చేశారు. హిందువుల మనోభావాలు, విశ్వాసాలను జగన్‌ ఏనాడూ గౌరవించలేదని విమర్శించారు.
 
తిరుమల నిబంధన ప్రకారం హైందవ ధర్మాన్ని నమ్ముతున్నామని చెప్పడం ప్రక్రియని చెబుతూ హైందవ ధర్మ డిక్లరేషన్ పాటించడంలో జగన్‌కు అడ్డంకి ఏమిటని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్ది ప్రశ్నించారు. గతంలో మత విశ్వాసన్ని గౌరవిస్తామని రాష్ట్రపతిగా అబ్దుల్ కలం, సోనియా గాంధీ సంతకం చేశారని గుర్తుచేశారు. వైసీపీలో ఉన్నవారు అబ్దుల్ కలాం, సోనియా గాంధీ కంటే గొప్పవారా? అని నిలదీశారు. 
 
ఇతర దేశస్థులు కూడా సంతకం పెడుతుంటే, వైసీపీ ఆలోచన ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఆలయ నిబంధనలకి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ‘‘సంతకం పెట్టమంటే, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంత పెద్ద వారైనా, గొప్పవారైనా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాల్సిందే. ఏడుకొండలు లేవన్న వ్యక్తులు, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు. ఆంజనేయ స్వామి చేయి తీసేశారు, రాముల వారి తల తీసేశారంటే పట్టించుకోని వ్యక్తి జగన్మోహన్ రెడ్ది. తిరుమల విధానం ప్రకారం నడుచుకోకపోతే తిరుమలలో అడుగు పెట్టనివ్వం’’ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.