మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని సీఐడీ పోలీసులు తనపై రాజద్రోహం కేసు పెట్టి, 2021 మే 14న తనను అరెస్టు చేసి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించి హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జులై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కస్టడీలో చిత్రహింసలు పెట్టడం నిజమేనని తేలింది. ఈ మేరకు నాటి సీఐడీ సిబ్బంది వాంగూల్మంలో కీలక విషయాలు వెల్లడించారు. విచారణ అధికారులకు అన్ని వివరాలను వెల్లడించారు. రఘురామ చిత్రహింసలను వీడియో కాల్‌లో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు చూపించడంతో అలా కాదు కొట్టేది అని ఆయన చెప్పినట్టు వివరించారు.
వీడియో కాల్‌లో చూసిన వెంటనే ముసుగేసుకున్న నలుగురిని తీసుకుని సునీల్ కుమార్ పైకి వచ్చారని తెలిపారు. రఘురామను కొడుతూ.. వీడియోకాల్లో తమ చీఫ్‌కు చూపామని సీఐడీ పోలీసులు వివరించారు. ముసుగేసుకున్న నలుగురితో కలిసి సీఐడీ చీఫ్ సునీల్ వచ్చారని సెంట్రీ వివరించారు. ఈ మేరకు అందరి నుంచి గుంటూరు పోలీసులు వాంగ్మూలాలు తీసుకున్నారు.
సునీల్ కుమార్ సమక్షంలోనే రఘురామ రాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని విచారణలో సిబ్బంది వివరించారు. దీంతో ఈ కేసులో అప్పటి సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ పాత్రపై కచ్చితమైన ఆధారాలు దొరికినట్లయింది. నిజాలు బయటపడడంతో గూగుల్ టేక్ఔట్ ద్వారా సునీల్ కుమార్ కదలికలను పోలీసులు గుర్తించారు. సీఐడీ చీఫ్‌గా ఉన్న సమయంలో సునీల్ కుమార్ కాల్ డేటాపై కూడా పోలీసులు కన్నేశారు.
ఇక నాడు సీఐడీ విచారణ అధికారిగా ఉన్న విజయ్ పాల్ మెడకు కూడా ఉచ్చుబిగుస్తోంది. రిటైర్మెంట్ ముందు ఆయనకు ఏఎస్పీగా పదవోన్నతి కల్పించడం, రిటైర్మెంట్ తర్వాత ఓఎస్డీగా నియమించడం చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.
రఘురామ ఒంటిపై గాయాలు ఉన్నాయని జీజీహెచ్ వైద్యులు వాంగ్మూలం ఇచ్చారు. అయితే అప్పటి జీజీహెచ్ సూపరిండెంట్ ప్రభావతిపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేశారు. దీంతో ఆమె తప్పుడు నివేదికను కోర్టుకు సమర్పించారు. నిజాలు బయపడుతుండడంతో దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. విజయ్ పాల్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.ఈ కేసుతో సంబంధం గల సీనియర్ అధికారులే రక్షణ కల్పిస్తున్నట్లు భావిస్తున్నారు.
More Stories
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆరోపణలపై కుమారస్వామి ఆగ్రహం
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి నిధులివ్వాలి