తిరుపతి కొండ, తిరుపతి గుండు, తిరుపతి లడ్డూ భక్తులపాలిట వరప్రసాదాలు. గోవిందా… గోవిందా… గోవిందా..! నామస్మరణం భక్తి పారవశ్యానికి పరాకాష్ట.
మానవ తప్పిదాలకు పుణ్యక్షేత్రాన్ని వేదికగా చేసుకుని రాజకీయ కక్షల్ని, కార్పణ్యాల్ని బహిరంగంగా చర్చించుకోవడం, నిందారోపణలు చూస్తుంటే భగవంతుని పట్ల మనకున్న భక్తి, శ్రద్ధలను ప్రకటించుకోవటమా? దైవానికి అపవిత్రతను ఆపాదించడమా? ఈ మీమాంసను భక్తాగ్రేశ్వరులమని చెప్పుకునే రాజకీయ క్రీడాకారుల విజ్ఞతకే వదిలివేయడం ఉత్తమం.
కలియుగ ప్రత్యక్ష దైవం ఈ తుచ్ఛ రాజకీయ నాయకుల పిచ్చి చేష్టలను చూస్తూ ఊరుకోడు. తప్పు చేసిన వాళ్లు ఎంత పెద్దవారైనా శిక్షించకమానడన్నది శ్రీవారి భక్తుల్లో ప్రస్ఫుటంగా వెల్లడవుతున్న అభిప్రాయం. ఆ భక్తి శ్రద్ధలే వారిలో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాల్ని కట్టిపడేశాయేమో. వారి విశ్వాసమే ఆలయ పవిత్రతను తరతరాలుగా కాపాడుతూ వస్తుంది. భగవంతునిపై భక్తి ఉండాలి తప్ప భౌతిక, బాహ్యపదార్ధాలపై కాదన్న నిత్యసత్యాన్ని సగటు భక్తుడు సూచిస్తున్న సదాచారం మనందరికీ మార్గదర్శనమే.
లడ్డూ ప్రసాదం విషయమై మాట్లాడిన, మాట్లాడుతున్న మగా(హా)నుభావులు, అధిక ప్రసంగీకులు, మీడియా ప్రతనిధులు, మే(తా)ధావులు, జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల ట్యాగులు తగిలించుకుని మాట్లాడడం తప్పు. విశ్లేషణలు, హెచ్చరికలు కేవలం ముడిసరుకుల నాణ్యతా ప్రమాణాలు, వాటి ధరలు, సరఫరా వరకే పరిమితమైతే బాగుండేది. ఆలయ ప్రతిష్టతను దిగజార్చే విధంగా మాట్లాడడం, దైవనిందకు దారితీయకూడదు. రెచ్చగొట్టే ప్రసంగాలు పబ్లిక్ ఆర్డరును భంగపరిచే దిశలో కొనసాగడం నేరం. ప్రభుత్వాలు అటువంటి దుష్ప్రచారాన్న సెన్సార్ చేయాల్సిన అవసరం ఈ దిశగా ఎంతైనా ఉంది.
మెడమీద తలకాయ ఉన్నోళ్లంతా వాళ్ల వాళ్ల స్వంత అభిప్రాయాల్ని గుళ్లకు, గోపురాలకు ఆపాదించేటపుడు సంయమనాన్ని పాటించాలి. భక్తుల మనోభావాల్ని గుర్తించి మరీ మాట్లాడడం పౌరధర్మం, శ్రేయస్కరం.
సామాన్య జనానికి ఎవరు అధికారంలో ఉన్నపుడు తప్పు జరిగిందన్నది అప్రస్తుతం. దేవడి ప్రసాదాన్ని సొంత లాభం కోసం అపవిత్రం చేసినవారు, వాళ్లను కాపాడేశక్తులు కచ్చితంగా ఆ కర్మను అనుభవిస్తారన్న గట్టి నమ్మకం వారిలో పెల్లుబుకుతోంది. చట్టాలు తప్పు చేసిన వాళ్లను శిక్షించి తీరాలి. తిరిగి అటువంటి తప్పులు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. భక్తజనంలో భరోసా కల్పించి దైవత్వాన్ని పెంచాలి. ధర్మాన్ని నిలబెట్టాలి. ధర్మో రక్షిత: రక్షిత అన్న ఆర్యోక్తిని పాలకులు మనసా, వాచా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రహ్మోత్సవాలు (అక్టోబర్, 4) దగ్గర పడుతున్న తరుణంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు, చేష్టలకు తెరదింపాల్సిన సమయం ఇది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రాన్ని నిత్యం వేలాది భక్తులు స్వామి వారి ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించుకుని తరిస్తుంటారు. అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి దేవదేవుడిని మరోసారి దర్శించుకున్నంత అనుభూతికి లోనవుతారు. తిరుపతి లడ్డూకు అంత ప్రాధాన్యత ఉంది.
మూడు వందల ఏళ్ల చరిత్ర. 1715వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన తొలిసారిగా లడ్డూ ప్రసాదాన్ని బూందీ రూపంలో (పొడి లడ్డు) ఆలయ కైంకర్యంలో భాగంగా ప్రవేశపెట్టారని పండితులు చెబుతున్నారు. 1940వ సంవత్సరం నాటికి లడ్డూ రూపంలో ప్రసాదం వాడుకలోకి వచ్చింది. 2010వ సంవత్సరం వరకు రోజుకు ఒక లక్ష లడ్డూల తయారీకి ఏర్పాటు ఉండేది. ఆ పరిమితి కాలక్రమేణా రోజుకు పది లక్షల లడ్లకు పెరగడం విశేషం.
గమనార్హమైన విషయమేమిటంటే, జీఐ గుర్తింపు (ట్యాగ్), పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్ పొందిన లడ్డూ ప్రసాదం ఈరోజు నాణ్యత విషయంలో విమర్శలకు గురికావడం ఆలయ నిర్వహణ లోపం కాక మరేమిటి?
మనిషి (భక్తుడు) నాలుక కంటే బెస్ట్ ల్యాబ్ ఉండదు కదా! గత కొన్నేళ్లుగా లడ్డూ ప్రసాదం ప్రమాణాలు పడిపోతున్నాయన్న ప్రజావాణి దేవస్థానానికి తెలియనిది కాదు. నానాటికీ పడిపోతున్న లడ్డూ నాణ్యత, రుచి, రంగు గమనించి కూడా భక్తులు నిగ్రహాన్ని పాటిస్తున్నారు. తీర్థయాత్రలో దైవదూషణ, ఆరోపణలు తగదని. భక్తి, శ్రద్ధలే పరమావధిగా మెలిగారు ఇన్నేళ్లుగా. పాలకమండలి నిమ్మకు నీరెత్తిన చందంగా మౌనం వహించడం దైవాపచారం కాక మరేమిటి?
గుళ్లు, గోపురాలు, కళాక్షేత్రాలు, కల్యాణమండపాలు ప్రపంచవ్యాప్తంగా కట్టడానికి ఎనలేని నిధులున్న దేవస్థానానికి పూర్తిస్థాయి క్వాలిటీ కంట్రోల్ డివిజన్‌ను గ్లోబల్ స్థాయి టెక్నాలజీతో పెట్టుకోవాలన్న దైవ చింతన లేకపోవడం కడు శోచనీయం. అమూల్ సంస్థ వలె నేషనల్ డెవలప్‌మెంట్ డైరీ బోర్డ్ వాళ్లను అడిగినా ఎప్పుడో ఏర్పాటు చేసి ఉండేవారు. మానవ తప్పిదం మాధవునికి అంటగట్టే దయనీయమైన పరిస్థితి ఈ రోజు ఉత్పన్నమై ఉండేది కాదు.
బెటర్ లేట్ ద్యాన్ నెవర్ అన్న చందంగా ఇప్పటికైనా ఆ ఆలోచన రావడం మంచి పరిణామమే. ఒక్క నెయ్యి విషయంలోనే కాదు, దేవస్థానం పోటులో తయారయ్యే పదార్ధాలకు వాడే దినుసులు, ద్రవ్యాలన్నింటినీ టెస్ట్ చేస్తే బాగుంటుంది. ఈరోజు నెయ్యి, రేపు ద్రాక్ష, బెల్లం వంటి వస్తువులు నాసి రకం సరుకులు కావచ్చు ఈ కల్తీ ప్రపంచంలో.
దేముడి తీర్థ ప్రసాదాలంటేనే భక్తి పూర్వకంగా అరచేతలో స్వీకరించి నాలుకపై వేసుకుని ఆరగించడం మన ఆచారం. దర్శనానంతరం సామాన్య భక్తులకు రెండు చిన్న లడ్లు ఇవ్వడానికి లడ్డూ కౌంటర్‌లో ఎన్నో షరతులు పెట్టే దేవస్థానం వారు, టన్నుల కొద్దీ లడ్లను ఢిల్లి లాంటి మహానగరాల్లో ఉంటున్న బడా వ్యాపారవేత్తలకు, ఘరానా రాజకీయ నాయకుల ఇళ్లకు, విందులు, వినోదాలకు పంపడమే కాకుండా, మీడియాలో ప్రచారం చేసుకోవడం దేవస్థానం ప్రతిష్టను దిగజార్చడం కాదా? దేవస్థానం ఉన్నతాధికారుల, పాలకమండలి సభ్యుల ఆగడాల్ని ప్రశ్నించేదెవరు?
ఇక దేవస్థానం ఉద్యోగులు, స్థానిక ఛోటామోటా రాజకీయ నాయకులు వాళ్ల పరపతిని పెంచుకోవడానికి లడ్డూ ప్రసాదాన్ని మాధ్యమంగా వాడుకోవడం దురదృష్టకరం. ఇక బ్లాక్‌మార్కెట్ సరేసరి. ఈమధ్యనే ముగిసిన ఎన్నికల్లో పోటీ చేసిన స్థానిక అభ్యర్ధులు ఓటర్లను ప్రభావితం చేసే దిశలో లడ్డూ ప్రసాదాలను పంచడం జుగుప్సాకరం. ఈ వికృత చేష్టలను తక్షణమే అరికట్టకపోతే, లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని తగ్గించిన వాళ్లమవుతాం. ఈ మధ్యకాలంలో తిరుపతి లడ్డూ ప్రసాదమంటేనే పెద్దగా ఆసక్తి చూపకపోవడం, మొక్కుబడిగా స్వీకరించడం చూస్తూనే ఉన్నాం.
కానీ, గ్రామాల్లో ఇప్పటికీ తిరుపతి వెళ్లి వచ్చిన భక్తుల్ని చూసి, స్వామివారిని దర్శించుకున్నంత అనుభూతి పొందుతారు. తిరుపతి గుండు చేయించుకుంటే, ఇంకా పవిత్రంగా భావిస్తారు. యాత్రికులను ప్రోత్సహించి, భక్తిభావాన్ని ఎల్లెడలా వ్యాప్తి చేయాల్సిన కార్యక్రమాలు దేవస్థానం ఎంత ఎక్కువగా చేపడితే, ఆలయ పవిత్రతను అంత ఇనుమడింప చేసినట్టు.
కొండకు వెళ్లి వచ్చిన తర్వాత శనివారం రోజు భక్తుల ఇళ్లలో శుచిగా, శుభ్రంగా పూజాది కార్యక్రమాలు ముగించి, రాగి చెంబులో తెచ్చిన తీర్థ ప్రసాదాన్ని నలుగురికి పంచి ఎంతో తృప్తిని పొందుతారు గ్రామీణులు. కాశీదారం అందరితో పంచుకుంటారు. ముంజేతికి కట్టుకుని మురిసిపోతారు. స్వామివారి భక్తుల ఇళ్లల్లో శనివారం మాంసాహారాన్ని ముట్టకపోవడం ఆచారం. ఇదీ భక్తంటే.
స్వామివారి రోజువారీ కైంకర్యాలకు, ప్రసాద వితరణకు కావాల్సిన ఆవు నెయ్యి దేవస్థానం డైరీ నుంచి రావడం సంప్రదాయం. ఉత్పాదనను బట్టే, లడ్డూల తయారీని నియంత్రించాలి. డిమాండ్, సప్లయ్ గ్యాప్ దృష్ట్యా, ఏ భక్తుడూ లడ్డూ ప్రసాదమే కావాలని ఉద్యమించడు. ఇస్తే తీసుకుని తృప్తి చెందుతాడు. స్వామివారి దర్శన ద్వారం వద్ద చిన్న అరటిపండు ఇచ్చినా మహాభాగ్యంగా భావిస్తాడు. స్వామివారిని అతి చేరువలో దర్శించుకునే ప్రముఖులకు అర్చకులు చిన్న అరటిపండు ఇవ్వడం పరిపాటే.
దేవస్థానం డైరీ ఉత్పత్తి (కెపాసిటీ) దేశలవారీగా పెంచుతూ, తదనుగుణంగా భక్తులకిచ్చే ప్రసాదాలు పంచితే బాగుంటుంది. పది లక్షల లడ్లు రోజువారీ తయారు చేయాల్సిందేనన్న నిబంధనేమీ లేదు. ప్రత్యామ్నాయ ప్రసాద విషయమై పాలకమండలి పరిశీలిస్తే బాగుంటుంది. ఆవు నెయ్యి పేరు చెప్పి డాల్డా వాడే దుస్థితికి దారితీయకుండా… ప్రసాదాన్ని వ్యాపార వస్తువుగా మార్చకుండా..!
ఇక ఇతర ద్రవ్యాల విషయానికి వస్తే, దాతల నుంచి నేరుగా ఆహార ధాన్యాలు సేకరిస్తే సబబుగా ఉంటుంది. భక్తి, ముక్తి రక్తి కట్టించిన వాళ్లమవుతాం. దాతలకు కొదువలేదు. ఇప్పటికీ ఎన్నో దేవాలయాల్లో రైతులు పండించిన ధాన్యాని, దినుసుల్ని నిత్యాన్నదాన కార్యక్రమంలో వాడడం మనందరికీ తెలుసు. కమ్యూనిటీ సహకారంతో ధర్మకార్యాల్ని నిర్వహించడమే అసలు సిసలైన ధార్మికం.
వేలం ద్వారా, టెండర్ల ద్వారా ప్రసాదం తయారీ విధానానికి స్వస్తి చెప్పాల్సిన అవసరాన్ని ధర్మకర్తలు గుర్తించాలి. కమ్యూనిటీ భాగస్వామ్యం తో కమర్షియల్ ఆధిపత్యాన్ని తగ్గించి సేవా ప్రవృత్తిని పెంపొందింపచేసే విధంగా పథకాలు రూపొందించాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో, పక్కనున్న కర్ణాటక, తమిళనాడుlaలో తి.తి.దే కల్యాణమండపాలు విస్తరించి ఉన్నాయి. అలాగే, తి.తి.దే ఆధ్వర్యంలో నడుపబడుతున్న దేవాలయాలు మరెన్నో. వీటినే ధాన్యసేకరణ కేంద్రాలుగా చేసుకుని, దేవస్థానం ఒక క్రమపద్ధతిలో విరాళాలను వస్తు రూపేణా రాబడితే భక్తుల్లో నమ్మకం బలపడ్తుంది.
దేశంలోనే పేరెన్నికగన్న పాలపదార్ధాల ఫెడరేషన్లు వారి ఉత్పత్తుల్లో ఒక శాతం దేవాలయానికి కేటాయంచగలిగితే, వారి వారి సమార్ధ్యాన్నిబట్టి, ఆ కంపెనీనే ఎందుకు ప్రోత్సహించారు? ఈ కంపెనీకి సప్లయి ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదన్న విమర్శలకు తావుండదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వలె, పెద్ద పెద్ద కంపెనీలు ధార్మక కార్యాలకు చేయూతనిచ్చేలా చర్యలకు ఉపక్రమిస్తే స్వామికార్యం, స్వకార్యం నిర్వర్తించిన వాళ్లవుతారు.. దైవ కార్యక్రమంలో భాగంగా. ఈ కంపెనీలన్నీ రైతుల భాగస్వామ్యంతో నడిచేవే.
గత పాతికేళ్లుగా దేవస్థానాన్న టార్గెట్‌గా చేసుకుని ఎన్నో దుమారాలు, దుష్ప్రచారాలు వెలుగు చూశాయి. ఏడు కొండలు, రెండు కొండలు, పింక్ డైమండ్, అన్యమత వ్యాప్తి, చిరుతపులి చిన్నారి బాలిక వేట మొదలుకుని ఎర్రచందనం స్మగ్లింగ్ వరకూ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, దేవాలయ పవిత్రతకు, దేవదేవుని భక్తి ప్రతిష్టకు ఎలాంటి భంగం వాటిల్ల లేదు. వాటిల్లదు కూడా. ముల్లోకాలేలే మూడు నామాల వాడికి మనం భక్తితో ముడుపులు చెల్లిస్తే చాలు.మన కోరికలు నెరవేరుతాయి.
కుల, మతాలకు అతీతంగా, నేను హిందూ ధర్మానికి వ్యతిరేకిని కాను, దేవుడిని నమ్ముతాను అన్న ప్రామాణికం(డిక్లరేషన్) ఆధారంగా, బీదా బిక్కీ అన్న తేడా లేకుండా, సర్వమానవాళికి అభయహస్తం చూపే సర్వేశ్వరుడికి మానవమాత్రుడి రక్షణ అవసరం లేదు.ఈ సలక్షణం ఒక్క తిరుమలవాసిడికే సొంతం. స్వామివారి లీలలు భక్తలు మనస్సులో సదాస్మరణీయాలు. కొండకు వచ్చిన ప్రతిసారీ ఎంతో స్వాంతన పొందే సామాన్యుల అనుభవాల్ని విస్తృతంగా ప్రచారంలోకి తెస్తే, అంతకంటే స్వామివారికి మనం చేయాల్సంది ఏమీ లేదు.
కరుణామయుడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు, జగద్రక్షకుడు ఆయన. అదేమోకాని దర్శించుకున్న ప్రతిసారీ ఒక కొత్త అనుభూతి.శ్రీ వారిని మొదటి సారిగా చూస్తున్న అలౌకిక ఆనందం. ఇంకెక్కడా దొరకని సంతృప్తి.
More Stories
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా గద్దలతో ‘ఈగల్ స్కాడ్’
ఉత్కంఠ పోరులో పాక్ పై భారత్ జయకేతనం