ప్రపంచంలోనే అతిపెద్దదైన చైనా నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్‌తో భూమికి ముప్పు ఏర్పడనుందా? ఈ డ్యామ్ కారణంగా భూగమనంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ డ్యామ్ కారణంగా ఎప్పటికైనా భూగ్రహానికి ముప్పేనని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు.
హుబే ప్రావిన్సుల్లోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కి.మీ పొడవు, 181 మీటర్ల ఎత్తులో త్రీగోర్జెస్ డ్యామ్‌ను చైనా నిర్మించింది ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ డ్యామ్ అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే కట్టడాల్లో ఒకటి. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1994లో ప్రారంభించిన చైనా 2006 నాటికి పూర్తి చేసింది. డ్యామ్ కోసం 114 పట్టణాలు, 1,680 గ్రామాలను చైనా ప్రభుత్వం ఖాళీ చేయించింది.
ఫలితంగా 14 లక్షల మందికి పునరావసం కల్పించింది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యాంగ్జి నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకెన్లు తగ్గిపోయిందని అప్పట్లోనే శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు. అంతేకాకుండా అంతేకాదు ఈ భారీ డ్యామ్ వల్ల భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని,. సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు.
దీని ప్రభావం రానురానూ ఇంకా పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమిపై భారీ మొత్తంలో ఏమైనా మార్పులు జరిగినప్పుడు దాని ప్రభావం భూ గమనంపై పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తుంది. 2004లో హిందూ మహా సముద్రంలో భూకంపం సంభవించి సునామీ వచ్చినప్పుడు భూ గమనంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దాని ప్రభావంతో రోజు నిడివి సుమారు 2.68 మైక్రో సెకెన్లు తగ్గిపోయింది. ప్రస్తుతం త్రీ గోర్జెస్ డ్యామ్ వల్ల కూడా ఇదే ప్రమాదం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
త్రీ గోర్జెస్ డ్యామ్‌కు మూడు నదుల నుంచి నీరు వచ్చి చేరుతుంది. సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్ల నీటిని ఇది నిల్వ చేస్తుంది. అంత భారీ మొత్తంలో నీరు ఒకే చోట చేరడం భూమిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ డ్యామ్ ద్వారా 22,500 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే ప్రపంచంలోనే అతి పెద్దవైన మూడు అణు విద్యుత్తు కేంద్రాల ఉత్పత్తికి దాదాపు ఇది సమానం.
ఈ డ్యామ్ నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారీ లక్షల మంది నిరాశ్రయులుగా మారుతున్నారు. వరద తీవ్రత పెరిగి ఈ డ్యామ్‌కు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టం ఊహకు కూడా అందదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘ఐఎఫ్‌ఎల్ సైన్స్’ తాజా కథనం ప్రకారం, గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ సమానంగా పరుచుకుంటాయి. ఒక్కచోట ఏదైనా భారీ బరువు చేరితే..‘ఇనెర్షియా’వల్ల సదరు వస్తువు తిరిగే వేగం తగ్గుతుంది. దీనినే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ అంటారు. త్రీగోర్జెస్ డ్యామ్‌తో భూమిపై ఇలాంటి ప్రభావమే పడి భ్రమణ వేగం తగ్గినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ డ్యామ్‌లో నీటి నిల్వ కారణంగా ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ ప్రభావం ఏర్పడుతుందని వెల్లడించారు.
More Stories
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా గద్దలతో ‘ఈగల్ స్కాడ్’
ఉత్కంఠ పోరులో పాక్ పై భారత్ జయకేతనం