బాలిస్టిక్‌, క్రూయిజ్ మిస్సైళ్లు వాడితే.. ఆ దేశాల‌పై అణుదాడి చేస్తాం

బాలిస్టిక్‌, క్రూయిజ్ మిస్సైళ్లు వాడితే.. ఆ దేశాల‌పై అణుదాడి చేస్తాం
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో యూకే, అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలబడిన సంగతి తెలిసిందే. నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా ఉక్రెయిన్ కు అవసరమైన ఆయుధాలను సమకూరుస్తున్నాయి. ఇలా అందుకున్న అత్యాధునిక క్షిపణులను రష్యాపైకి ఉక్రెయిన్ ప్రయోగిస్తోంది. 
 
తాజాగా యూకే అత్యాధునిక క్రూయిజ్ మిసైళ్లను ఉక్రెయిన్ కు అందజేసిందని, వాటిని రష్యాలోని పలు ప్రాంతాలపైకి ఉక్రెయిన్ ఎక్కుపెట్టిందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. రష్యాలోని ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయి అణుబాంబు ప్రయోగ సంసిద్ధతపై చర్చించారు. 
 
అనంతరం మాట్లాడుతూ, రష్యా భూభాగంపై క్రూయిజ్ మిసైళ్లు పడితే అణుబాంబు ప్రయోగించాల్సి వస్తుందని పశ్చిమ దేశాలను సీరియస్ గా హెచ్చరించారు. యుద్ధం మొదలై ఏడాది గడిచి పోయినా ఉక్రెయిన్ లొంగకపోవడం, రష్యన్ బలగాలను దీటుగా ఎదుర్కొంటూ ఎదురుదాడులు చేస్తుండడం వెనక పాశ్చాత్య దేశాలు ఉన్నాయని పుతిన్ ఆరోపిస్తున్నారు. 
 
ఉక్రెయిన్ కు ఆయుధాలను ఇస్తూ రష్యాపై దాడులు చేయిస్తున్నారని మండిపడుతున్నారు. కిందటి వారం యూకే పలు క్రూయిజ్ మిసైళ్లను ఉక్రెయిన్ కు పంపించిందని, వాటి వినియోగానికి జెలెన్ స్కీకి అనుమతినిచ్చిందని సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు యూకే ప్రధాని కీవ్ స్టార్మర్ అమెరికాకు వెళ్లి అధ్యక్షుడు జో బైడెన్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 
 
దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించడంతో పుతిన్ వెంటనే స్పందించారు. తమ భూభాగంపై క్రూయిజ్ మిసైల్ దాడి జరిగితే అణు బాంబు ప్రయోగిస్తామని పాశ్చాత్య దేశాలకు స్పష్టం చేశారు.  ఏ స‌మయంలో ఎప్పుడు, ఎందుకు అణ్వాయుధం వాడుతామో ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ అణ్వాయుధ ర‌హిత‌ దేశం నుంచి త‌మ‌పై దాడి జ‌రిగితే, ఆ దాడికి అణ్వాయుధ దేశం మద్ద‌తు ఇస్తే, దాన్ని సంయుక్త దాడిగా ప‌రిగ‌ణిస్తామ‌ని, ఆ సంద‌ర్భంలో తాము అణ్వాయుధాన్ని వాడ‌నున్న‌ట్లు పుతిన్ తెలిపారు.

ఉక్రెయిన్ అణ్వాయుధ ర‌హిత దేశ‌మ‌ని, ఒక‌వేళ ఆ దేశం క‌నుక అణు దాడిలో పాల్గొంటే, దానిపై న్యూక్లియ‌ర్ వెప‌న్ ప్ర‌యోగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పుతిన్ వెల్ల‌డించారు. ప‌శ్చిమ దేశాలు అందిస్తున్న లాంగ్ రేంజ్ మిస్సైళ్ల‌ను ఒక‌వేళ ఉక్రెయిన్ వాడితే, అప్పుడు ఆ దేశంపై అణు బాంబుతో దాడి చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పుతిన్ వెల్ల‌డించారు.

ఒక‌వేళ ర‌ష్యాపై భారీ స్థాయిలో మిస్సైల్ లేదా వైమానిక దాడి జ‌రిగితే, దాని గురించి స‌మ‌గ్ర‌మైన స‌మాచారం అందితే, అప్పుడు అణ్వాయుధాన్ని వాడుతామ‌ని ప్రకటించారు. ర‌ష్యాతో పాటు మిత్ర‌దేశ‌మైన బెలార‌స్‌పై కూడా దాడి జ‌రిగితే తిప్పికొడుతామ‌ని తేల్చి చెప్పారు.

శ‌త్రు దేశాలు ఒక‌వేళ బాలిస్టిక్ లేదా క్రూయిజ్ మిస్సైళ్ల‌, లేదా వ్యూహాత్మ‌క వైమానిక దాడి, డ్రోన్ల‌ను వినియోగించినా.. ఆ దేశాల‌పై అణ్వాయుధాల‌తో దాడి చేయ‌నున్న‌ట్లు పుతిన్ తెలిపారు. అయితే తాము ప్ర‌క‌టించిన కొత్త అణు సిద్ధాంతం ఎప్ప‌టి నుంచి అమ‌లులోకి వ‌స్తుంద‌న్న విష‌యాన్ని మాత్రం పుతిన్ స్ప‌ష్టం చేయ‌లేదు.