మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై విచారణకు గవర్నర్ ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా.. గవర్నర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఆయన తన స్వీయ నిర్ణయాధికారాన్ని సక్రమంగా అన్వయించారని వ్యాఖ్యానించింది. ఆయన ఆదేశాలకు (ముఖ్యమంత్రిని విచారించడానికి) సంబంధించినంత వరకు, గవర్నర్ చర్యలలో ఎటువంటి తప్పిదం లేదని కోర్టు అభిప్రాయపడింది. ముడా భూముల కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదుపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ స్పందించారు.
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సుమారు 14 సైట్లను అక్రమ రీతిలో సీఎం సిద్దరామయ్య భార్యకు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో సీఎం సిద్దును విచారించాలని గవర్న్ గెహ్లాట్ ఆదేశాలు ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం, భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 218 ప్రకారం.. సీఎంను విచారించే అవకాశాలు ఉన్నట్లు గవర్నర్ తన ఆదేశాల్లో తెలిపారు.
ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. దీనిని సిద్ధూ గత నెలలోనే హైకోర్టులో సవాల్ చేయగా.. స్వల్ప ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకూ ముందుకెళ్లొద్దని సూచించింది. తాజాగా, ఈ పిటిషన్‌పై తీర్పు వెలువరించిన జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం.. గవర్నర్ చర్యను సమర్దించింది. సిద్ధరామయ్య పిటిషన్‌ను తిరస్కరించింది. ముడా భూకేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి హస్తం ఉందని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కొన్నాళ్లుగా ఆరోపిస్తోంది. .
More Stories
‘జమిలి’ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
హిందువులపై దాడికి పాల్పడిన వారిపై చర్యకు బంగ్లా హామీ
టిఎంసి సభ్యుడి క్షమాపణ తిరస్కరించిన మంత్రి సింధియా