లైంగిక దాడి కేసులో సిపిఎం ఎమ్మెల్యే ముఖేశ్‌ అరెస్ట్‌

లైంగిక దాడి కేసులో సిపిఎం ఎమ్మెల్యే ముఖేశ్‌ అరెస్ట్‌
జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ మలయాళీ సినీ పరిశ్రమను కుదించి వేస్తున్నది. మహిళా నటులపై లైంగిక వేధింపులకు సంబంధించిన నివేదిక పరిశ్రమను వణికిస్తున్నది. చాలామంది ప్రముఖ నటీనటులు, దర్శకులు, రాజకీయ నేతలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నటుడు, సీపీఐఎం నేత, కొల్లాం ఎమ్మెల్యే ఎమ్‌ ముఖేశ్‌పై  కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. 

లైంగిన దాడి ఆరోపణల నేపథ్యంలో కేరళ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన మీటూ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.ఇందులో భాగంగానే కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ముందు మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఇక విచారణలో భాగంగా అతన్ని దాదాపు మూడు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. 

విచారణ అనంతరం ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఎర్నాకులం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడంతో వైద్య పరీక్షల అనంతరం విడిచిపెట్టారు. స్నేహితురాలైన తోటి జూనియర్ ఆర్టిస్ట్ ఇంటి వద్దకు వచ్చిన ముకేశ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మరో జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించింది. హైకోర్టు నిర్ణయం ప్రకారం ముకేశ్ పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని సిపిఎం ప్రకటించింది.

జస్టిస్ కే హేమ కమిటీ రిపోర్ట్‌ బయటపెట్టాక మహిళ నటీమణుల ఆరోపణల నేపథ్యంలో ముఖేశ్‌, జయసూర్య, సిద్ధిఖీ సహా పలువురు మలయాళ సినీ ప్రముఖులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సిద్ధిఖీపై పోలీసులు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సిద్ధిఖీ పిటిషన్‌ను కొట్టివేసింది. 

కోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళ పోలీసులు సిద్ధిఖీని అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అతడికి లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నటుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.