తిరుమలలో ప్రభుత్వ జోక్యం, ఇతర మతస్తుల నియామక ఫలితమే!

తిరుమలలో ప్రభుత్వ జోక్యం, ఇతర మతస్తుల నియామక ఫలితమే!
తిరుమల తిరుపతి దేవస్థానంలో అందించే పవిత్ర లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును నెయ్యిలో వినియోగిస్తున్నారని ఇటీవల వచ్చిన ఆరోపణలపై విశ్వహిందూ పరిషత్ – కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యలు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఈ ఘోర అవమానాన్ని ఖండించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులు సోమవారం శ్రీనివాస మంగాపురంలోని శ్రీలలితపఠం, శ్రీవశిష్టాశ్రమంలో శనివారం సమావేశమయ్యారు.
 
ఇది హిందూ విశ్వాసానికి గాయం. ఈ క్రూరమైన చర్య ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తుల ధార్మిక మనోభావాలను ఉల్లంఘించడమే కాకుండా హిందువుల అత్యంత గౌరవప్రదమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల తిరుపతి పవిత్రతను కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనను ఆలయ వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, ఇతర మతాలకు చెందిన వ్యక్తులను ఆలయ నిర్వహణలో అధికార స్థానాలకు నియమించడం ప్రత్యక్ష ఫలితం అని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు హిందూ ధార్మిక సంస్థల స్వయంప్రతిపత్తిని హరించివేసి భక్తుల్లో అపనమ్మకాన్ని కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. 
తిరుపతి దేవస్థానం లడ్డూలలో జంతు కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర, నిష్పక్షపాత న్యాయ విచారణ జరపాలని కోరింది. రోజువారీ విచారణ ఆధారంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ హేయమైన చర్యకు బాధ్యులైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, అప్పుడే భవిష్యత్తులో ఇటువంటి నేరాలకు వ్యతిరేకంగా చట్టం నిరోధకంగా పనిచేస్తుందని తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే హిందూ దేవాలయాలపై తమ నియంత్రణను నిలిపివేయాలని, హిందూ సమాజం తన స్వంత ధార్మిక సంస్థలను నిర్వహించడానికి అనుమతించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. దేవాలయాలు మళ్లీ విశ్వాసం, ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా మారాలని, హిందూ సంప్రదాయాలను అర్ధం చేసుకునే మరియు, గౌరవించే అంకితభావం గల వ్యక్తులచే నిర్వహించబడాలని అభిలాషను వ్యక్తం చేసింది. 

దేవాలయాలు హిందూ సమాజంలోని అన్ని వర్గాల అవసరాలను తీర్చేలా చూసేందుకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇది స్వతంత్రంగా దేవాలయాలు నిర్వహణను పర్యవేక్షించే విధంగా ఉంటుందని తెలిపింది. ఈ పరిషత్ ఆలయ నిర్వహణకు ప్రజాస్వామ్య, సమ్మిళిత విధానాన్ని నిర్ధారిస్తూ, సాధువులు, హిందూ సంస్థలు, పండితులు, భక్తుల నుండి ప్రతినిధులతో కూడి ఉండాలని వివరించింది. 
 
పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలి అన్ని హిందూ దేవాలయాల స్వచ్ఛత, పవిత్రతను కాపాడాలని కోరుతూ, ఇకపై ఎలాంటి ధార్మికపరమైన పద్దతులలో లేదా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. హిందూ భక్తుల హక్కులను పరిరక్షించడం, వారి ధార్మిక స్వేచ్ఛను సమర్థించడం చాలా అవసరం అని స్పష్టం చేసింది.
రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన ధార్మిక స్వేచ్ఛను గౌరవించాలని, హిందువులు తమ స్వంత ధార్మికపరమైన సంస్థలను నిర్వహించడానికి అనుమతించాలని వారు ప్రభుత్వాలను కోరారు. అలా చేయడం ద్వారా, ప్రభుత్వాలు వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని, విశ్వాసాన్ని, గౌరవాన్ని పెంపొందించగలవని, రాష్ట్రాలు, దేశం  మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తాయని తెలిపారు.