దామగుండం అడవుల్లో 1.93 లక్షల చెట్లు మాత్రమే తొలగింపు

దామగుండం అడవుల్లో 1.93 లక్షల చెట్లు మాత్రమే తొలగింపు
 
* రాడార్ స్టేషన్ కు 12 లక్షల చెట్లు తొలగింపు అంటూ దుష్ప్రచారం
 
వికారాబాద్‌ జిల్లా దామగుండం అడవుల్లో తూర్పు నౌకాదళ రాడార్‌ స్టేషన్‌ను నెలకొల్పేందుకు 12 లక్షల చెట్లను తొలిగించనున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి రాకేశ్‌ మోహన్‌ డోబ్రియాల్‌ స్పష్టం చేశారు. ఫారెస్ట్‌ అడ్వైజరీ అథారిటీ 1,93,562 చెట్లను మాత్రమే రాడార్‌ స్టేషన్‌ నిర్మాణం కోసం తొలిగిస్తున్నదని ఆయన తెలిపారు. 

రాడార్‌ ఏర్పాటుకోసం 12 లక్షల చెట్లను తొలిగించనున్నారని వస్తున్న వార్తలు నిరాధారమైనవనీ, అసంబద్ధమైవని ఆయన చెప్పారు. రాడార్‌ ప్రాజెక్టు నిర్మాణ కోసం కేటాయించిన మొత్తం అటవీ భూముల్లో 48 శాతం విస్తీర్ణం మాత్రమే రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఉపయోగిస్తారని, మిగతా 52 శాతం విస్తీర్ణంలోని అటవీ సంపదకు ఎలాంటి హానీ జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 
 
ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో కోల్పోనున్న 1,93,562 చెట్లకు బదులుగా రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల అడవుల్లోని 2,348 హెక్టార్లలో విస్తరించి ఉన్న 17,55,070 చెట్లను అటవీశాఖ పునరుద్ధరించనున్నదని డోబ్రియాల్‌ తెలిపారు. ఈ ప్రాంతంలో 500 ఏండ్లుగా కొలువై ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా తరలిస్తున్నారనే వాదననూ కూడా డోబ్రియాల్‌ ఖండించారు. 
 
ఈ ప్రాంతంలో 32 ఎకరాల 10 గుంటల్లో విస్తరించిన ఈ ఆలయంతోపాటు, అనుబంధంగా ఉన్న కొలను అలాగే కొనసాగుతాయని, ఆలయాన్ని సందర్శించే భక్తులకు నేవీ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు. దామగుండంలో రాడార్‌ స్టేషన్‌ నిర్మాణంతో పర్యావరణానికి పెనుముప్పు కలుగనున్నదని కొందరు చేస్తున్న వాదనలను ఆయన కొట్టిపారేశారు.