బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే మ్యాచ్ ఫిక్సింగ్ .. పొంగులేటి మధ్యవర్తి

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే మ్యాచ్ ఫిక్సింగ్ .. పొంగులేటి మధ్యవర్తి

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిమధ్యవర్తిగా వ్యవహారం నడిపిస్తున్నారని బిజెపి శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. అందుకే గత ప్రభుత్వ తప్పిదాలపై బిజెపి సీబీఐ విచారణ కోరడం లేదని ఆయన ధ్వజమెత్తారు. దమ్ముంటే సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ వ్రాస్తే 24 గంటల్లో ప్రారంభం అవుతుందని ఆయన సవాల్ చేశారు.

సీబీఐ ప్రవేశిస్తే పరిస్థితి ఎలా వుంటుందో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు తెలిసిందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ 9 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై, గత ప్రభుత్వం చేసిన ఎన్నో తప్పిదాలను బయటకు తీసుకు వస్తుండగా, ఇన్నాళ్లు బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. తాను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నో అవినీతి అంశాలను లేవనెత్తానని తెలిపారు.

మంత్రి పొంగులేటి, మాజీ మంత్రి కేటీఆర్, రాజకీయ డ్రామలో భాగంగానే వారు పరస్పరం సవాళ్లు చేసుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తాను అవినీతి ఆరోపణలను బైట పెట్టేందుకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అంటూ ఆయన సవాల్ చేశారు. దీనికి మంత్రి పొంగులేటి, మాజీ మంత్రి కేటీఆర్ సిద్ధమేనా? అంటూ నిలదీశారు. ఈ ప్రభుత్వ 9 ఏండ్ల పాలన, గత ప్రభుత్వ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధం అని తెలిపారు.
 
తాను చేసిన ఆరోపణలను నిరూపించలేని పక్షంలో తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని స్పష్టం చేశారు. నిరూపిస్తే… మంత్రి పొంగులేటి, మాజీ మంత్రి కేటీఆర్ తప్పుకుంటారా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ తరుపున ఎప్పుడూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రజల దృష్టికి తీసుకోస్తున్నామని చెప్పారు. అయితే, బిజెపి ఏంచేయనట్లుగా, తానే ఏదో కొత్తగా ఆరోపణలు చేస్తున్నట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు.
తాను అసెంబ్లీ సాక్షిగా ఎన్నో అవినీతి ఆరోపణలు చేశానని చెబుతూ అప్పుడు ఎన్నడూ స్పందించని కేటీఆర్ ఇప్పుడు తన పేరు ప్రస్తావించి మాట్లాడుతుండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు.

ఎన్నడూ లేనిది కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు? దానికి కాంగ్రెస్ ఎందుకు స్పందిస్తుందని ప్రశ్నిస్తూ కేసీఆర్ కుటుంబాన్ని పూర్తిగా కాపాడుతున్నదే ఢిల్లీ కాంగ్రెస్ అని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.  కేటీఆర్, హరీశ్ రావు.. ఢిల్లీకి వెళ్లి కేసీ వేణుగోపాల్ తో ఏం ఒప్పందం చేసుకున్నారు? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాం.. ఆ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుంటామని చెప్పింది వాస్తవం కాదా? అని బిజెపి నేత నిలదీశారు.
 
బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తో కలుస్తుంటే రేవంత్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో పొంగులేటి మధ్యవర్తిత్వంతో కలవడం నిజం కాదా? అని అయన ప్రశ్నించారు. తెలంగాణకు సిబిఐ  వచ్చే రోజు తొందరలో వస్తుందని చెబుతూ వారు వచ్చినప్పుడు ఒకటి కాదు రెండు కాదు.. కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, భూ కుంభకోణాలన్నీ బయటకు వస్తాయని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.