ఆర్మీ అధికారికి కాబోయే భార్యపై పోలీసుల లైంగిక వేధింపులు

ఆర్మీ అధికారికి కాబోయే భార్యపై పోలీసుల లైంగిక వేధింపులు
పోకిరీల నుంచి కాపాడమంటూ ఆర్మీ అధికారి అయిన కాబోయే భర్తతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయబోయిన ఒక మహిళా న్యాయవాది పట్ల ఒడిశా  పోలీసులు కర్కశంగా ప్రవర్తించి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపుతోంది.  ఆమెను జుట్టుపట్టుకుని కొట్టి, కాళ్లూ, చేతులు కట్టేసి దారుణంగా హింసించడమే కాక, ఆమె బట్టలను ఊడదీసి లైంగికంగా వేధించారు.
 
తర్వాత ఆమెపై తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపారు. భువనేశ్వర్ లోని భారతపూర్ పోలీస్ స్టేషన్ లో  ఈ ఘటన ఈ నెల 15న జరుగగా, రిమాండ్‌ నుంచి విడుదలైన బాధితురాలి ఫిర్యాదుతో ఈ అమానుష కాండ వెలుగుచూసింది.  రెస్టారెంట్‌ యజమాని, మహిళా న్యాయవాది అయిన 32 ఏండ్ల మహిళ ఆర్మీ కెప్టెన్‌, కాబోయే భర్తతో ఈ నెల 15న రెస్టారెంట్‌ మూసి బయటకు వస్తుండగా, కొందరు పోకిరీలు వేధించారు. 
 
దీంతో వారు వెంటనే భరత్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వడానికి ప్రయత్నించారు. అక్కడ సివిల్‌ దుస్తుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్‌ వారితో అనుచితంగా ప్రవర్తించింది. ఆర్మీ అధికారిని పోలీసులు అకారణంగా బంధించారు. ఇదేమని ప్రశ్నించిన ఆ మహిళను కొట్టడం ప్రారంభించారు. 
 
ఆమె కాళ్లు, చేతులు కట్టేయడానికి ప్రయత్నించారు. దీంతో ప్రతిఘటించిన ఆమె ఆత్మరక్షణకు కానిస్టేబుల్‌ చేతిని కొరికింది. దాంతో ఆమెను బంధించి లాకప్‌లో పడేశారు. మర్నాడు ఉదయం స్టేషన్‌కు వచ్చిన ఇన్‌స్పెక్టర్‌ ఆమె ఛాతిపై, శరీరంపై తన్నడం ప్రారంభించాడు. చాలా సేపు అమెను కొట్టి, ఆమె ప్యాంట్‌ను ఊడదీశాడు. 
 
తర్వాత తన ప్యాంట్‌ కూడా కిందకు లాగి అతని ప్రైవేట్‌ పార్టును చూపిస్తూ ఎంతసేపు నీవు మౌనంగా ఉండగలవు అంటూ దూషించాడు. తర్వాత మహిళా కానిస్టేబుల్‌ను కొట్టిందని ఆమెపై తప్పుడు కేసు నమోదు చేసి కోర్టుకు పంపడంతో రిమాండ్‌ విధించారు. 
 
తర్వాత ఆమెకు బెయిల్‌ రావడంతో పోలీస్‌ స్టేషన్‌లో తనపై జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఒడిశా డిజిపి వై బి ఖురానియా  క్రైమ్ బ్రాంచ్ విచారణకు ఆదేశించారు.ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు, రాష్ట్రవ్యాప్తంగా సిసి కెమెరాలు లేని పోలీస్ స్టేషన్లపై నివేదిక కోరారు.  సిక్కు రెజిమెంట్ ఆర్మీ అధికారి మేజర్ గుర్వాన్ష్‌పై దాడి చేసిన ‘పోకిరి’లపై కేసు నమోదు చేయాలని డిజిపి ఆదేశించారు.
 
ఈ ఘటన రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తోందని ప్రతిపక్ష నేత, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ విమర్శించారు. “ఇటీవల పోలీస్ స్టేషన్‌లో ఆర్మీ మేజర్, అతని కాబోయే భార్యకు ఏమి జరిగిందో అందరూ విన్నారు” అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పూర్తి న్యాయ విచారణ జరిపి, త్వరగా చర్యలు తీసుకోవాలని ఆయన  డిమాండ్ చేశారు.
 
ఇంతకు ముందు గవర్నర్ కుమారుడిపై తీవ్రమైన దాడి కేసుపై చర్య తీసుకోవడానికి బిజెపి ప్రభుత్వం నిరాకరించడంతో ఇతర పోలీస్ అధికారులు సహితం ధైర్యంతో ఇటువంటి అకృత్యాలకు పాల్పడగలుగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.