త్వరలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కొంత వరకు కాంగ్రెస్ కు సానుకూలత కనిపిస్తున్నా, కాంగ్రెస్- బిజెపి మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ముఖ్యంగా 26 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ ద్విముఖ పోరు నెలకొందని, అవే విజేతను తేలుస్తాయని వెల్లడించింది.
హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 46. కనీసం 46 సీట్లలో విజయం సాధించిన పార్టీ లేదా కూటమి అధికారం చేపడుతుంది. సెప్టెంబర్ 20 నాటికి రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఈ ఎన్నికల్లో గెలుపోటముల అవకాశాలపై పీపుల్స్ పల్స్ నివేదిక ఆసక్తికర అంచనాలను వెలువరించింది.
మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో, 35 సీట్లలో కాంగ్రెస్ వైపు మొగ్గు కనిపిస్తోంది, 23 సీట్లలో బీజేపీ ఆధిక్యత కనిపిస్తోందని ఈ సర్వే తేల్చింది. స్వతంత్రులు 3 స్థానాల్లో, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కూటమి మరో 3 సీట్లలో విజయం సాధించవచ్చని అంచనా వేసింది. మిగతా 26 సీట్లలో హోరాహోరీ పోరు తప్పదని తేల్చింది. ‘‘అంటే, ఈ 26 సీట్లలో అత్యధిక సీట్లను గెల్చుకుంటే బీజేపీకి మళ్లీ అధికారం చేపట్టే అవకాశం ఉంది. లేదా కాంగ్రెస్ ఈ సారి, 10 ఏళ్ల తరువాత మళ్లీ అధికారంలోకి వస్తుంది’’ అని పీపుల్స్ పల్స్ తేల్చింది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. పార్టీ మేనిఫెస్టో సీరియస్ డాక్యుమెంట్ అని, బీజేపీ ఎప్పుడూ తన వాగ్దానాలను నెరవేర్చిందని, ఎన్నికల సమయంలో హామీ ఇవ్వని వాటిని కూడా అమలు చేసిందని నడ్డా తెలిపారు. బీజేపీ నాయకత్వంలో హరియాణా మారిందని చెబుతూ 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.37 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.3 లక్షలకు పెరిగిందని ఆయన తెలిపారు.
హరియాణా ఎన్నికల్లో లాడో లక్ష్మి యోజన కింద మహిళలకు నెలకు రూ.2,100, హర్ ఘర్ గృహిణి యోజన కింద రూ.500కే వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో బిజెపి హామీ ఇచ్చింది. ఓబీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన హర్యానా విద్యార్థులు దేశంలోని ఏదైనా ప్రభుత్వ మెడికల్ లేదా ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకోవడానికి ఉపకార వేతనాలు ఇస్తామని బిజెపి హామీ ఇచ్చింది. హర్యానాకు చెందిన ప్రతి అగ్నివీర్ కు గ్యారంటీగా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందని పేర్కొన్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. వాస్తవానికి అక్టోబర్ 1న పోలింగ్ జరగాల్సి ఉంది. కాగా, హరియాణా రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువకుల కోసం ఏడు ప్రధాన హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. మహిళలు, వితంతువులు, వృద్ధులకు రూ. 6 వేల పెన్షన్, కనీస మద్దతు ధరల చట్టం, కుల సర్వే, పాత పెన్షన్ పథకం (ఓపిఎస్) పునరుద్ధరణ మొదలైనవి అందులో ఉన్నాయి.
ఇలా ఉండగా, సీట్ల సర్దుబాట్ల కోసం కాంగ్రెస్ – ఆప్ ల మధ్య జరిగిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆప్ అన్ని సీట్లలో పోటీ చేస్తున్నది. దానితో పలు సీట్లలో కాంగ్రెస్ ఓట్లను ఆ పార్టీ ఏమేరకు చీలుస్తుందనే ప్రశ్న తలెత్తుతుంది. కాగా, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రెండు సొంతపార్టీలోని తిరుగుబాటుదారుల నుండే సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పట్టుదలతో బిజెపి ప్రచారం చేస్తుండగా, లోక్ సభ ఎన్నికలలో సగం స్థానాలు గెల్చుకున్న ఉత్సాహంతో కాంగ్రెస్ గెలుపుపై ధీమాతో ఉంది.
More Stories
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి నిధులివ్వాలి