జననాల రేటు తగ్గిపోతుండటంతో రష్యా తీవ్ర ఆందోళన చెందుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో జనాభా గణనీయంగా పడిపోతుందని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది.
నానాటికీ పడిపోతున్న జననాల రేటుతో బెంబేలెత్తిపోతున్న అధ్యక్షుడు పుతిన్ ప్రజలు పిల్లల్ని కనాలని మరోసారి అభ్యర్థించారు. ఉద్యోగాల్లో తీరిక లేకుండా గడుపుతున్నామంటూ పిల్లల్ని కనడాన్ని వాయిదా వేయొద్దని సూచించారు. పనిలో బిజీబిజీగా ఉండే వాళ్లు భోజన సమయం, సాయంత్రాలు కాఫీలు తాగేటప్పుడు శృంగారంలో పాల్గొని బిడ్డల్ని కనాలని సూచించారు. జనాభా పెంచి దేశాన్ని కాపాడాలని కోరారు
‘‘రష్యా ప్రజల్ని కాపాడుకోవడానికే ప్రస్తుతం తొలి ప్రాధాన్యత. రష్యన్ల జనాభాపైనే దేశ భవిత ఆధారపడి ఉంది’’ అని ఆయన అన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రుసి మెట్రా సంస్థ డేటా ప్రకారం రష్యాలో సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం ప్రతి మహిళకు 1.5 పిల్లలుగా ఉంది. ఇది జనాభాను కొనసాగించడానికి అవసరమైన 2.1 రేటుతో పోల్చుకుంటే చాలా తక్కువ.
ప్రజలపై ఉన్న పని భారమే వారు కుటుంబాలను మొదలుపెట్టేందుకు ఇష్టపడకపోవడానికి కారణన్న వాదనలను రష్యా ఆరోగ్య మంత్రి డాక్టర్ యెవ్జెనీ షెస్టోపలోవ్ కొట్టివేశారు. రుష్యా ప్రజల రక్షణ తమ అత్యున్నత జాతీయ ప్రాధాన్యమని అధ్యక్షుడు పుతిన్ గతంలోనే స్పష్టం చేశారు. “రష్యా భవితవ్యం. మనలో ఎంతమంది ఉంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమస్య,” అని పేర్కొన్నారు.
రష్యా జననాల రేట్ క్షీణత 1999 కన్నా కనిష్టానికి చేరుకుంది. జూన్లో 100,000 కంటే తక్కువ జననాలు నమోదయ్యాయి. యూరో న్యూస్ రష్యా అధికారిక గణాంకాల సంస్థ రోస్టాట్ను ఉటంకిస్తూ, గత సంవత్సరంతో పోలిస్తే 2024 మొదటి అర్ధభాగంలో 16,000 తక్కువ జననాలు జరిగాయని వెల్లడించింది.
అదనంగా, జనాభా క్షీణత 18 శాతం వేగవంతమైంది. ఈ సంవత్సరం 49,000 మరణాలు నమోదయ్యాయి. ఇది ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్దం వల్ల మరింత తీవ్రమైంది. తమ మహిళా సిబ్బందిని పిల్లలను కనడానికి ప్రేరేపించేలా యజమానులపై ఒత్తిడి తెచ్చే విధానాలను ఎంపీ తత్యానా బుట్స్కయా ప్రతిపాదించారు.
చెల్యాబిన్స్క్ ప్రాంతం వారి మొదటి బిడ్డకు జన్మనిచ్చిన 24 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళా విద్యార్థులకు 8,500 పౌండ్లు అందిస్తోంది. ప్రభుత్వం గర్భస్రావానికి యాక్సెసబిలిటీని కూడా పరిమితం చేస్తోంది. ప్రజాప్రతినిధులు, మత పెద్దలు సంతానోత్పత్తి, పెంపకంలో మహిళల పాత్రను సమర్థిస్తున్నారు. అంతేకాకుండా, దంపతులు విడిపోవడాన్ని తగ్గించేందుకు విడాకుల ఫీజులను పెంచారు.
మహిళలు 19 లేదా 20 సంవత్సరాల వయస్సులో పిల్లలను కనడం ప్రారంభించాలని, తద్వారా కుటుంబాలు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనవచ్చని రాజకీయ నాయకురాలు అన్నా కుజ్నెత్సోవాసూచించారు.
More Stories
గాజా హమాస్ అప్రకటిత ప్రధాని ముష్తాహాను చంపేశాం
2050 నాటికి అగ్రరాజ్యాలుగా భారత్, అమెరికా, చైనా
ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్