ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీలో ఫైనల్ కు చేరిన భారత్

ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీలో ఫైనల్ కు చేరిన భారత్
ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త పురుషుల హాకీ జ‌ట్టు అజేయంగా ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. కొరియాపై సంపూర్ణ‌ ఆధిప‌త్యం చెలాయించిన టీమిండియా భారీ తేడాతో జ‌య‌భేరి మోగించింది. ఆదివారం జ‌రిగిన రెండో సెమీస్‌లో భార‌త ఆట‌గాళ్ల ధాటికి కొరియా డిఫెన్స్ క‌కావిక‌లం అయింది.  ఆరంభం నుంచి ప్ర‌త్య‌ర్థిని వణికించిన టీమిండియా 4-1తో కొరియాకు చెక్ పెట్టింది.
టైటిల్ పోరులో ఆతిథ్య చైనాతో హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్ బృందం త‌ల‌ప‌డ‌నుంది. ఒలింపిక్స్‌లో వ‌రుస‌గా రెండో కాంస్యంతో చ‌రిత్ర సృష్టించిన భార‌త జ‌ట్టు మ‌రో టైటిల్‌కు చేరువైంది.  డిఫెండింగ్ చాంపియ‌న్‌గా ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీలో అడుగ‌పెట్టిన టీమిండియా వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్ చేరింది. ఆదివారం కొరియాపై చాంపియ‌న్ త‌ర‌హా ఆట‌తో రెచ్చిపోయిన హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్ బృందం 4-1తో విజ‌య గ‌ర్జ‌న చేసింది.

తొలుత ఉత్తమ్ సింగ్ 13 వ నిమిషంలో మొద‌టి గోల్ అందించాడు. ఆ త‌ర్వాత కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్(19, 49 వ నిమిషంలో) రెండు గోల్స్‌తో ఆధిక్యాన్ని మూడుకు పెంచాడు. ఆ త‌ర్వాత కొరియా ఆటగాళ్లు గోల్ కోసం ఎంత ప్ర‌య‌త్నించినా భార‌త డిఫెన్స్, గోల్‌కీప‌ర్ వాళ్ల ఆట‌లు సాగ‌నివ్వ‌లేదు. జ‌మ‌న్ ప్రీత్ సింగ్(32 నిమిషంలో) మ‌రో గోల్ కొట్ట‌డంతో కొరియా ఆశ‌ల‌కు తెర‌ప‌డింది.

కాగా, ఈసారి ఆతిథ్య చైనా జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. సంచ‌ల‌న ఆట‌తో తొలిసారి ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. సోమ‌వారం జరిగిన‌ సెమీఫైన‌ల్లో మూడుసార్లు చాంపియ‌న్ పాకిస్థాన్‌ను చైనా చిత్తుగా ఓడించింది. 

ఆట ఆరంభం నుంచి పాక్ జ‌ట్టుకు ముచ్చెమ‌టలు ప‌ట్టించిన చైనా ఆట‌గాళ్లు 1-1తో స్కోర్ స‌మం చేశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన పెనాల్టీ షూటౌట్‌లోనూ చైనా ఆటగాళ్లు అద్భుతం చేశారు. 2-0తో ఆధిప‌త్యం క‌న‌బ‌రిచి పాక్‌ను సాగ‌నంపారు. చైనా చేతిలో ఓట‌మితో టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన జ‌పాన్ ఐదో స్థానం కోసం మ‌లేషియాతో త‌ల‌ప‌డ‌నుంది.