ముంబై నటి అక్రమ నిర్భందం, బెదిరింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్లు 1590, 1591, 1592ను ప్రభుత్వం విడుదల చేసింది. కాన్ఫిడెన్షియల్ అని ప్రభుత్వ వెబ్‌సైట్ పేర్కొంది.
డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఈ అభియోగాలపై విచారణ జరిపి నివేదిక రూపొందించారు. ఈ నివేదికను డీజీపీకి సమర్పించారు, ఈ నివేదిక ఆధారంగానే ముుగ్గురు ఐపీఎస్‌ల మీద చర్యలు తీసుకున్నారు.
ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను డీజీపీ సస్పెండ్ చేశారు. మరికొందరు పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ముంబయి సినీ నటి కాదంబరి జెత్వాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ సీపీ ఏసీపీ స్రవంతిరాయ్ ఆధ్వర్యంలో ఓ సిట్ను ఏర్పాటు చేశారు. ముంబయి నటి, ఆమె తల్లిదండ్రులు, మరికొందరిని సిట్ విచారించింది. వారినుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది.
అనంతరం ఈ వ్యవహారంపై ప్రాథమిక నివేదికను తయారు చేసి డీజీపికి అందించారు. డీజీపీ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా ఈ దర్యాప్తును పర్యవేక్షించిన అధికారిగా విఫలమైనట్టు ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఈ కేసు దర్యాప్తును అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా తేలింది. ఎఫ్ఐఆర్ 2.2.2024న నమోదైతే 31.1.2024 న సీతారామాంజనేయులు అప్పటి విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ తదితర దర్యాప్తు బృందాన్ని సీఎంఓకు పిలిచి, సినీ నటీ జెత్వానీని అరెస్టు చేయమని ఆదేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
2024 ఫిబ్రవరి రెండో తేదీన ఉదయం 6:30 గంటలకి విశాల్ గున్ని బృందం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. డీజీపీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ముంబైకి వెళ్లినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఏడున్నర గంటలకి ముంబై వెళ్లే విమానం ఎక్కినట్టు విచారణలో వెల్లడించింది.
సినీనటి జత్వాని అరెస్టుకు సంబంధించినటువంటి అంశాన్ని డీజీపీకి సమాచారం ఇవ్వకుండా, పై అధికారులకు ఏమాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ముంబై వెళ్లడంపైనా అభియోగాలు నమోదు చేసింది. అదే సమయంలో ముంబైకి వెళ్లినటువంటి అప్పటి డీసీపీ విశాల్ గున్నీ పోలీసుల బృందం కనీసం ఈ ప్రయాణానికి సంబధించిన టీఏ, డీఏలకు సంబంధించినటువంటి బిల్లులు కూడా సమర్పించకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఎఫ్ఐఆర్ నమోదైన కొన్ని గంటల్లోనే ఎలాంటి లిఖితపూర్వక ఆధారాలు, ఆదేశాలు లేకుండానే అరెస్టు వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడంపైనా అభియోగాలు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, విజయవాడ డీసీపీ విశాల్ గున్నీ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
కాగా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని ఆమె ఆరోపించారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాల మీద ముంబయి వచ్చి తనతో పాటు తల్లిదండ్రులను అరెస్టు చేయడం కుట్రలో భాగమేనని ఆమె పేర్కొన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలోనే తనను అక్రమంగా నిర్బంధించారని ఆమె పేర్కొన్నారు.
More Stories
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆరోపణలపై కుమారస్వామి ఆగ్రహం
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం