హారిస్‌, ట్రంప్‌ల మధ్య వాడివేడిగా డిబేట్

హారిస్‌, ట్రంప్‌ల మధ్య వాడివేడిగా డిబేట్

అమెరికా అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్‌, ట్రంప్‌ల మధ్య మొదటి అధికారిక డిబేట్‌ వాడివేడిగా సాగింది. ఇరువురు అభ్యర్థులు దేశ ఆర్థిక వ్యవస్థ, వలస చట్టాలు, విదేశాంగ విధానం, వాణిజ్య యుద్ధాలు, అబార్షన్‌ హక్కులు సహా పలు అంశాలపై పరస్పరం దాడి చేసుకున్నారు. 

నవంబర్‌ ఎన్నికలకు ముందు భారీ అంచనాలున్న ఈ డిబేట్‌ పెన్సిల్వేనియాలోని ఫిలదెల్ఫియాలో జరిగింది. ఇరువురి షేకహ్యేండ్స్‌తో ప్రారంభమైన చర్చ పరస్పరం విమర్శలతో కొనసాగింది. డెమోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ అబార్షన్‌ పరిమితులు, పదవికి ఫిట్‌నెస్‌, ఇతర చట్టపరమైన సమస్యలపై ప్రశ్నలతో రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ను డిఫెన్స్‌లో పడేశారు. 

ట్రంప్‌ ప్రచార ర్యాలీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు తరచుగా అలసట, విసుగుతో ప్రచారం ముగియకుండానే వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. దీంతో హైతీ వలసదారులపై ట్రంప్‌ అస్పష్టమైన ఆరోపణలు చేశారు. విదేశీ వస్తువులపై అధిక సుంకాలను విధించాలనే ట్రంప్‌ విధానంపై దాడి చేశారు. ఈ ప్రతిపాదన మధ్యతరగతిపై అమ్మకపు పన్నుతో పోల్చారు. తమ ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలకు పన్ను ప్రయోజనాలను కల్పిస్తోందని పేర్కొన్నారు.

ట్రంప్‌ దేశంలో నిరుద్యోగాన్ని తీవ్రతరం చేశారని విమర్శించారు. 2017-2021 మధ్య ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు.  ట్రంప్‌ మహిళలకు అబార్షన్‌ కేర్‌, ఇతర అత్యవసర సంరక్షణ చర్యలను నిరాకరించారని హారిస్‌ ధ్వజమెత్తారు. ట్రంప్‌ గెలిస్తే అబార్షన్‌పై నిషేధాన్ని విధిస్తారని స్పష్టం చేశారు.

వలసదారుల నివారణకు బైడెన్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ట్రంప్‌ పేర్కొన్నారు. దీంతో తమ దేశాన్ని కోల్పోతున్నామని, దేశంలోకి ప్రజలు అక్రమంగా ప్రవేశిస్తున్నారని తెలిపారు. ట్రంప్‌కు హారిస్‌ ధీటుగా సమాధానమిచ్చారు. ఈ అక్రమ వలసల సమస్యను పరిష్కరించే వారి కోసం అమెరికా ప్రజలు ఎదురుచూస్తున్నారని, ట్రంప్‌ ఈ సమస్యను పరిష్కరించరని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి తానే సరైన నేతనని ఆమె స్పష్టం చేశారు.

ఇజ్రాయిల్‌, గాజాల మధ్య, రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాల గురించి చర్చ వాడిగా వేడిగా జరిగింది. తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయిల్‌కు ఉందని, ఇప్పటికీ ఈ వైఖరికి కట్టుబడి ఉన్నానని హారిస్‌ పేర్కొన్నారు. గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలని తేల్చి చెప్పారు. హారిస్‌ ఇజ్రాయిల్‌ను ద్వేషిస్తోందని, తాను ఇజ్రాయిల్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంలో తాను ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతున్నట్లు హారిస్‌ తెలిపారు. జాతి గురించి ట్రంప్‌ సంధించిన ప్రశ్నలకు చాలా వరకు కమలా హ్యారిస్‌ నేరుగా సమాధానం చెప్పలేదు.

నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌, డెమాక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హారిస్‌ పోటీ పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఇది ఓ గొప్ప చర్చగా అభివర్ణిస్తూ, ఎప్పటికీ ఇది అత్యుత్తమ చర్చల్లో ఒకటిగా భావిస్తున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. హారిస్‌తో మరో చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. కమలా హారిస్‌ కూడా ట్రంప్‌తో సెకెండ్‌ డిబేట్‌కు సిద్ధమైనట్లు ఉపాధ్యక్షురాలి ప్రచార చైర్‌ జెన్‌ ఓ మల్లే డిల్లాన్‌ తెలిపారు. అక్టోబర్‌లో రెండో డిబేట్‌ ఉంటుందని తెలిపారు.