సీపీఎం నేత సీతారాం ఏచూరి క‌న్నుమూత‌

సీపీఎం నేత సీతారాం ఏచూరి క‌న్నుమూత‌
క‌మ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 72 ఏళ్లు. సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ రాజ్య‌స‌భ ఎంపీ అయిన ఏచూరి డిల్లీలోని ఎయిమ్స్ వైద్య‌శాల‌లో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు కొన్ని రోజుల నుంచి అక్క‌డే చికిత్స చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. శ్వాస‌కోస స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఏచూరి ఇవాళ మ‌ర‌ణించిన‌ట్లు ఆ పార్టీ ప్ర‌క‌టించింది. ఆయనకు భార్య `ది వైర్’ ఎడిటర్ సీమా చిస్తీ, కూతురు అఖిల, కుమారుడు దానిష్ ఉన్నారు. 
 
ఆస్పత్రిలో చేరినప్పట్నుంచీ వెంటిలేటర్‌పైనే సీతారాం ఏచూరికి వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందించారు. ఆయన్ను కాపాడాలని వైద్యులు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి, డాక్టర్‌ గౌరి నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్‌ నుంచి కూడా ప్రత్యేక మందులు తెప్పించి వైద్యం చేసినట్లుగా తెలుస్తోంది.

ఆగ‌స్టు 19వ తేదీన ఎయిమ్స్ ఎమ‌ర్జెన్సీ వార్డులో ఆయ‌న్ను చేర్పించారు. ఆ త‌ర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు మార్చారు. 2015లో సీపీఎం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప్ర‌కాశ్ కార‌త్ నుంచి ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించారు. పార్టీ నేత హ‌రికిష‌న్ సింగ్ సుర్జీత్ వ‌ద్ద ఏచూరి ఎదిగారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన ఏచూరి తన పాఠశాల విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశారు, అయితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కారణంగా చదువులకు  అంతరాయం ఏర్పడటంతో 1969లో ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్లారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం జె ఎన్ యులో చేరారు.

వీపీ సింగ్ నేతృత్వంలోని నేష‌న‌ల్ ఫ్రంట్ , యునెటెడ్ ఫ్రంట్ కూట‌మి ప్ర‌భుత్వ ఏర్పాటులో ఏచూరి కీల‌క పాత్ర పోషించారు. ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి సీపీఎం బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇచ్చింది. తొలిసారి ఏర్ప‌డ్డ యూపీఏ ప్ర‌భుత్వానికి కూడా లెఫ్ట్ పార్టీలు మ‌ద్ద‌తు ఇచ్చాయి. ఆ స‌మ‌యంలోనూ ఏచూరి కీల‌క పాత్ర‌ను పోషించాడు. పాల‌సీ మేకింగ్‌లో కాంగ్రెస్ పార్టీపై ఆయ‌న వ‌త్తిడి తీసుకొచ్చారు.

1970వ దశకంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఏచూరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు, చివరికి 2015లో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. పార్టీ విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 2023లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలతో ఎన్నికలకు ముందు పొత్తులో కీలక పాత్ర వహించారు.

పశ్చిమ బెంగాల్, త్రిపురలలో పార్టీ ప్రభుత్వాలు పతనమైన తర్వాత జాతీయ స్థాయిలో పతనమైనప్పటి నుండి జాతీయ స్థాయిలో రాజకీయంగా  సిపిఎం ప్రాధాన్యత కోల్పోతున్నప్పటికే ఏచూరి ప్రభావంతో ఆ పార్టీ ఉనికి కాపాడుకో గలుగుతూ వస్తుంది.   ఆయన నాయకత్వంలో, సిపిఎం 2024 ఎన్నికలలో రాజస్థాన్ నుండి మొదటిసారిగా పార్లమెంటరీ స్థానాన్ని సంపాదించుకుంది.

అయితే,  పార్టీ తన సాంప్రదాయక కోటలలో తిరిగి పుంజుకోవడానికి చాలా కష్టపడింది. వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య వారధిగా పేరొందారు. ఆయనకు సోనియా గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది.  సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ, వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య సహకారాన్ని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పైగా, రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలతో స్నేహంగా ఉండేవారు. మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆయనకు సన్నిహితులు.

అయితే, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఏకైక నాయకుడు కావడంతో సిపిఎంలో అంతర్గతంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2017లో మూడోసారి రాజ్యసభకు కాంగ్రెస్ మద్దతుతో పశ్చిమ బెంగాల్ నుండి ఎన్నికయ్యేందుకు ప్రయత్నించినప్పుడు సొంత పార్టీ నుండే విమర్శలు ఎదుర్కొన్నారు.

అనేక భాషలలో నిష్ణాతులు. విశేషంగా పర్యటనలు జరిపిన ఆయన ఫిడెల్ క్యాస్ట్రోతో సహా పలువురు ప్రపంచ నాయకులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకున్నారు. 2021లో కరోనా మహమ్మారి సమయంలో తన కుమారుడు ఆశిష్‌ను కోల్పోవడంతో ఏచూరి ఆరోగ్యం, ప్రవర్తనపై విశేషంగా ప్రభావం చూపింది.