హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

సైబరాబాద్‌ సీపీ కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సీపీ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని రెండు వేర్వేరు వాహనాల్లో తరలించారు.

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని విడుదల చేయడంపై బీఆర్‌ఎస్‌ నేతలు అభ్యంతరం తెలిపారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అరెస్టు చేయకపోతే కోర్టు వెళ్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే గాంధీ అనుచరులు, కాంగ్రెస్‌ కార్యక్తలు గురువారం ఉదయం దాడి చేశారు. 

కౌశిక్‌రెడ్డి ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. కొండాపూర్‌లోని కౌశిక్‌ రెడ్డి నివాసానికి వచ్చిన గాంధీని పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. దానితో, దాడిని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ సీపీ ఆఫీస్‌ వద్ద ఆందోళనకు దిగింది. 

దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టులకు దిగారు. బీఆర్‌ఎస్‌ నేతలను ఈడ్చుకుంటూ వాహనాల్లో పడేశారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, గాంధీపై కేసు నమోదు చేస్తామని డిజిపి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించడంతో వారిని పోలీసులు విడిచిపెట్టారు.

బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు రాయలేనంతగా తిట్టిపోసుకున్న పరిస్థితి నెలకొన్నాయి. కౌశిక్ ఓ బ్రోకర్ అని.. దమ్ముంటే బయటికి రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరీ గాంధీ సవాల్ విసరడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

అనంతరం కౌశిక్‌రెడ్డి ఇంటివద్ద తన అనుచరులతో కలిసి అరెకపూడి గాంధీ బైఠాయించగా, పోలీసులు అతనిని పంపించే ప్రయత్నం చేశారు. కౌశిక్‌రెడ్డిని బయటకు పిలవాలని, లేదంటే తననే లోపలికి పంపించాలని అరెకపూడి గాంధీ డిమాండ్‌ చేశారు. కౌశిక్ ఇంటి వద్ద బైఠాయించి అరెకపూడి అనుచరులు నినాదాలు చేశారు. 

ఈ క్రమంలో పోలీసులు, అరెకపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లారు. అనంతరం అరెకపూడి గాంధీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదని ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.

ఇలా ఉండగా, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా 15 మంది ఆయన అనుచరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు. కౌశిక్‌రెడ్డితోపాటు గచ్చిబౌలి పోలీసులు సైతం ఎమ్మెల్యే గాంధీ, అతడి అనుచరులపై ఫిర్యాదులు చేయడంతో ఈ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

 దాడి, హత్యాయత్నం చేసినట్టు కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేయగా, తమ విధులకు ఆటంకం కలిగించినట్టు గచ్చిబౌలి ఎస్‌ఐ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా 15 మంది ఆయన అనుచరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు.

కౌశిక్‌రెడ్డితోపాటు గచ్చిబౌలి పోలీసులు సైతం ఎమ్మెల్యే గాంధీ, అతడి అనుచరులపై ఫిర్యాదులు చేయడంతో ఈ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దాడి, హత్యాయత్నం చేసినట్టు కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేయగా, తమ విధులకు ఆటంకం కలిగించినట్టు గచ్చిబౌలి ఎస్‌ఐ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనను హత్య చేయడానికి తన ఇంటి వద్దకు వచ్చారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం 11 గంటలకు బీఆర్‌ఎస్‌ తడాఖా చూపిస్తామంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ అరెకపూడి గాంధీ చేసిన చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. అరెకపూడి గాంధీ కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చారని, తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డనని కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.

పోలీసులపై కౌశిక్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను ఎందుకు అదుపు చేయలేదని ప్రశ్నించారు. తనపై దాడి జరుగుతుంతే చూస్తూ ఉండిపోయారని చెబుతూ పోలీసులే దగ్గరుండి తనపై దాడి చేయించారని ఆరోపించారు. తన ఇల్లు ధ్వంసం చేస్తుంటే అడ్డుకోలేకపోయారని విమర్శించారు.